ఆ బాధ మళ్లీ హిట్ కొట్టే వరకు ఉంటుంది

0

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ బాలీవుడ్ లో కూడా పలు సక్సెస్ లను దక్కించుకున్న విషయం తెల్సిందే. సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ జాబితా లో మురుగదాస్ ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి క్రేజ్ ను దక్కించుకున్న దర్శకుడు మురుగదాస్ తెలుగులో మాత్రం ప్రేక్షకులను నిరాశ పర్చుతూనే ఉన్నాడు. స్టాలిన్ చిత్రంతో మొదటి సారి డైరెక్ట్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మురుగదాస్ చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు తో స్పైడర్ చిత్రాన్ని చేశాడు. రెండు సినిమాలు కూడా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

ముఖ్యంగా మహేష్ బాబు తో చేసిన స్పైడర్ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ చాలా ఆశలు అంచనాలు పెట్టుకుని ఆ సినిమా చేశాడు. తమిళ ఆడియన్స్ కు స్పైడర్ తో మహేష్ బాబును దగ్గర చేయాలని మురుగదాస్ ప్రయత్నించి మొత్తానికే సినిమా దారుణ పరాజయం పాలయ్యేలా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంపై ఇటీవల స్పందించిన మురుగదాస్ ఆ విషయం తనను ఎప్పుడు బాధిస్తూనే ఉంటుందని అన్నాడు.

తాజాగా మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడిన మురుగదాస్ స్పైడర్ చిత్రం గురించి మాట్లాడటం జరిగింది. ఆ సినిమా కలిగించే బాధ మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేసి సక్సెస్ కొట్టే వరకు పోదని అన్నాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ కోసం కూడా ఒక కథను మురుగదాస్ తయారు చేశాడని వార్తలు వచ్చాయి. మరి ఈ ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు మురుగదాస్ తెలుగులో నిరూపించుకునేందుకు ఛాన్స్ ఇస్తారా చూడాలి.
Please Read Disclaimer