‘నేను నాస్తికుడిని.. కానీ హిందుత్వాన్ని గౌరవిస్తాను’

0

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అడుగుపెట్టిన తర్వాత ఎంత యాక్టీవ్ గా ఉంటున్నాడో అందరికి తెలిసిందే. రాజకీయ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. కొన్ని సార్లు వివాదాస్పద ట్వీట్స్ తో విమర్శలకు గురవుతూ వస్తున్నాడు. గాంధీని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ పొగడటం.. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మపై కామెంట్స్ చేయడం.. పొరుగుదేశం చైనా కవ్వింపు చర్యలపై ఫైర్ అవడం.. ఇలా ఆయన వేసే ట్వీట్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.. విమర్శలకు గురయ్యాయి.. కేసులు పెట్టే వరకు కూడా వెళ్లాయి. అయితే ఇటీవల నాగబాబు ట్వీట్స్ చేసే విధానంలో మార్పు వచ్చింది. ఎవరినో టార్గెట్ చేసేలా వివాదం చెలరేగేలా కాకుండా ఆలోచింపజేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మతాలు – హిందుత్వం గురించి ట్విట్టర్ లో స్పందించారు నాగబాబు.

నాగబాబు ట్వీట్ చేస్తూ.. ”నేనొక నాస్తికుడిని. కానీ కొన్ని మత సిద్ధాంతాల పట్ల నా ఒపీనియన్ చెప్పాలి. నేను హిందూయిజాన్ని గౌరవిస్తాను. కారణం ఏంటంటే ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా.. అనేక దేవతలున్నారని నమ్మినా.. విగ్రహారాధనని నమ్మినా.. ఇతర మతాలని నమ్మినా.. అసలు దేవుడే లేడనే నాస్తికులుని ఎవరినీ నిందించని మతం హిందూమతం. మనిషిని మనిషిగా మంచిగా బ్రతకమని చెప్తుంది హిందూ మతం. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెప్తుంది హైదవం. నీ మతం కాని వాడిని చంపెయ్యి.. విగ్రహారాధన చేసే వాళ్ళు నరకానికి పోతారు.. మా దేవుడు నిజమైన దేవుడు మీ దేవుడు చెడ్డవాడు లాంటి పిచ్చి మాటలు చెప్పని హిందుత్వం అంటే నాకు గౌరవం. కానీ నేనొక నాస్తికుడిని” అని పేర్కొన్నారు.