బాలకృష్ణ కిర్రాక్ లుక్.. ఇంపాక్ట్ చాలా పీక్స్‌లో ఉంటుందట!

0

నటసింహా నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ‘లెజెండ్’ సినిమా తరవాత మళ్లీ ఆ స్థాయి హిట్ బాలకృష్ణ ఇవ్వలేకపోయారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రాత్మక చిత్రం అనే పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

మళ్లీ బోయపాటి రూపంలో..

వరుస ఫ్లాపులతో డీలాపడిన బాలయ్యకు మళ్లీ బోయపాటి శ్రీను రూపంలో విజయానికి ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. బోయపాటితో బాలయ్య సినిమా అంటే బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెంట్‌తో ఆయన అభిమానులు ఉన్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ రూపంలో బాలకృష్ణకు బ్లాక్ బస్టర్లు ఇవ్వడమే కాకుండా ఆయన మార్కెట్‌ను కూడా నిలబెట్టారు బోయపాటి. మరి అలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. బాలకృష్ణ అనగానే బోయపాటి కేరింగ్ కూడా మరో స్థాయిలో ఉంటుంది.

విగ్ లేకుండా బాలయ్య

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గుండుతో సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ బాగా వైరల్ అయ్యింది. బోయపాటి సినిమా కోసమే బాలయ్య గుండు చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే, బాలయ్య హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారనే రూమర్ కూడా వచ్చింది. అయితే, దీనిలో నిజం లేదని సమాచారం. బోయపాటి సినిమాలో బాలయ్య విగ్ లేకుండా కనిపిస్తారట. ఇదే నిజమైతే.. బాలయ్య విగ్ లేకుండా నటించడం ఇదే మొదటిసారి అవుతుంది.

వైరల్ అవుతోన్న న్యూ లుక్

ఆ మధ్య గుండుతో బాలయ్య లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరో లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుండుతో ఉన్న లుక్‌తో నెరిసిన గెడ్డంతో కనిపించిన బాలయ్య.. ఇప్పుడు నల్లగా మిళమిళలాడుతోన్న గెడ్డం, మీసాలతో దర్శనమిచ్చారు. అంతేకాకుండా తలకు హ్యాట్ కూడా పెట్టుకున్నారు. ఈ లుక్‌లో బాలయ్య చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మొత్తం మీద బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యను కిర్రాక్ లుక్‌లో చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఈ లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న బాలయ్య అభిమానులు.. ‘‘ఈసారి ఇంపాక్ట్ చాలా పీక్స్ ఉంటుంది’’ అని అంటున్నారు.

వారణాసి నుంచి ప్రారంభం

బాలకృష్ణ 106వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వారణాసిలో మొదలవుతుందని సమాచారం. గతంలో బోయపాటి ‘జయ జానకి నాయక’ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు. ఈ చిత్రంలోని హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదు. జులై 31న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer