శ్వేత కెరీర్ కు ఆశలు చిగురిస్తున్నాయి…!

0

‘నందా లవ్స్ నందిత’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నందిత శ్వేత. ఆ తర్వాత కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇదే క్రమంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నందిత. తెలుగులో ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ ‘అభినేత్రి 2’ లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత.. ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ‘సెవెన్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ నేపథ్యంలో హారర్ – సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ‘ఐపీసీ 376’ అనే సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది నందిత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న కన్నడ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘కావలధారి’ రీమేక్ లో నటిస్తోంది.

కాగా తెలుగులో సుమంత్ హీరోగా ‘కపటధారి’ అనే టైటిల్ తో తెరకెక్కింది. తమిళ్ లో కట్టప్ప సత్యరాజ్ కొడుకు శిబి సత్యరాజ్ హీరోగా అదే పేరుతో రూపొందింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించారు. లాక్ డౌన్ కి ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కపటధారి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయిన నందిత.. ఇప్పుడు ‘ఐపీసీ 376’ మరియు ‘కపటధారి’ సినిమాలనే నమ్ముకొని ఉంది. ఈ సినిమాలు హిట్ ఐతే మళ్ళీ పుంజుకొని అవకాశాలు తెచ్చుకోవాలని తెగ ఆశ పడుతోందని తెలుస్తోంది. మరి ఈ మూవీస్ మంచి విజయం సాధించి అమ్మడి కెరీర్ కి ప్లస్ అవుతాయేమో చూడాలి.