గ్యాంగ్ లీడర్ డేట్ మారక తప్పదా?

0

నాని గ్యాంగ్ లీడర్ ఆగస్ట్ 30 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని ప్రకటనలు ఇచ్చిన రెండు వారాలకు సాహో కూడా అదే తేదీని లాక్ చేసుకోవడం చూసి క్లాష్ తప్పదేమో అన్న అనుమానం అందరికి కలిగింది. సాధారణంగా సాహో లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో ఢీ కొట్టడం ఏ హీరోకైనా అంత సేఫ్ కాదు. నానికి మార్కెట్ లో ఎంత ఇమేజ్ ఉన్నా అది ప్రభాస్ తో సమానం కాదు గ్యాంగ్ లీడర్ కు సాహో అంత స్టేచరూ లేదు. విడిగా చూసుకుంటే మాత్రం నాని వెయిట్ ని తగ్గించి చూపలేం.

అందుకే ఈ వాస్తవాన్ని గుర్తించే మైత్రి సంస్థ గ్యాంగ్ లీడర్ వచ్చే సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడం గురించి చర్చల్లో ఉందట. నిజానికి సాహోతో క్లాష్ అయినా పర్వాలేదు మనది ఫ్యామిలీ అండ్ యూత్ సినిమా కదా అని ఓ దశలో ఆలోచించారట. కానీ సాహో మీద నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఒకేరోజు వస్తే థియేటర్ల పంపకాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో ఆ మేరకు పోస్ట్ పోన్ చేసే దిశగా వెళ్తున్నట్టు సమాచారం

ఇవాళ విడుదల కాబోయే టీజర్ లో అనౌన్స్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. వీలైనంత త్వరగా చేసుకుంటే బెటర్. ఇతర సినిమాల నిర్మాతలకు క్లారిటీ వచ్చి తమవి షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మజిలీ- చిత్రలహరి- జెర్సీ ఓ అండర్ స్టాండింగ్ తో డేట్స్ కి సెట్ చేసుకుని వర్క్ అవుట్ చేసుకున్నాయి.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ మీద టైటిల్ తో పాటు కంటెంట్ మీదా చాలా ప్రత్యేకంగా అంచనాలు ఉన్నాయి. జెర్సీ హిట్ అయినా కమర్షియల్ గా చాలా పెద్ద రేంజ్ కు వెళ్లలేదనే చిన్న అసంతృప్తి నానిలో ఉంది. అది గ్యాంగ్ లీడర్ తో తీరుతుందని అభిమానుల నమ్మకం. మరి కొత్త డేట్ తో వస్తారో లేక ఇంకేదైనా ప్లాన్ ఉందేమో వేచి చూద్దాం
Please Read Disclaimer