బ్యాంకును ఊడ్చుకెళ్ళిపోయే గ్యాంగు!

0

న్యాచురల్ స్టార్ నాని త్వరలో ‘గ్యాంగ్ లీడర్’ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నాని గ్యాంగ్ లో అన్ని రకాల వయసులలో ఉన్న మహిళలు సభ్యులుగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఈ అంశమే అందరినీ ఆకట్టుకుంది.

అంతా బాగానే ఉంది కానీ ఈ విభిన్నమైన గ్యాంగుతో లీడర్ గారు ఏం చేయబోతున్నారనేదానిపై ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. ఈ విషయంలో తాజాగా ఒక హింట్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో నాని తన గ్యాంగుతో కలిసి ఒక బ్యాంకుకు కన్నం వేస్తాడట. సాధారణంగా బ్యాంకు రాబరీ అనగానే యాక్షన్ హీరోలు.. వారితో కండలు తిరిగిన బ్యాచ్ ఉంటుంది. ‘జులాయి’ సినిమాలో సోనూ సూద్ బ్యాచ్ అందుకు ఒక ఉదాహరణ. కానీ అలాంటివాటికి భిన్నంగా ఈ నాని గ్యాంగ్ మాత్రం కండబలం ఎక్కువ లేకపోయినా బుద్ధిబలంతో బ్యాంకులోని డబ్బును ఊడ్చుకెళ్ళిపోతారట. ఈ బ్యాంక్ దొంగతనమే సినిమాలో ఒక హైలైట్ అని అంటున్నారు.

ఈ సినిమాలో లక్ష్మి.. శరణ్య.. అనీష్ కురువిల్లా.. వెన్నెల కిషోర్.. రఘుబాబు.. ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. పెండింగ్ ఉన్న పాటలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.
Please Read Disclaimer