నరేశ్ వార్నింగ్.. బహిరంగం గా మాట్లాడితే చర్యలు తప్పవట

0

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో నెలకొన్న విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా రాజుకున్న వివాదం ఇప్పుడు సంచలనం గా మారింది. డైరీ ఆవిష్కరణ వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి కి రాజశేఖర్ పదే పదే అడ్డుకోవటం ఒక ఎత్తు అయితే.. పరుచూరి వారు మాట్లాడుతున్న వేళ.. ఆయన నుంచి మైకు లాగేసుకొని.. ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించిన రాజశేఖర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేశ్ మాట్లాడారు. మాలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఆ విషయాల్ని కమిటీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే చర్యలు తప్పవని స్పష్టం చేయటమే కాదు.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.

తమ సమస్యల్ని చెప్పుకునేందుకు వీలుగా స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి.. ఈ రోజు రాజశేఖర్ చేసిన వ్యవహారం మీద నరేశ్ చర్యలు తీసుకుంటారా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఇదిలా ఉంటే.. రాజశేఖర్ తీరును ఆయన సతీమణి జీవిత వెనకేసుకొచ్చారు.

తమ వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్స్ చేసే హక్కు ఎవరికి లేదన్న జీవిత.. తామేమీ ఎవరింట్లోనో కట్టేసే కుక్కలమో.. గేదెలమో కాదన్నారు. చిరంజీవి తమకు చాలా సమయం కేటాయించారన్న ఆమె.. తమ అభివృద్ధి కి చిరు ఎన్నో సలహాలు ఇచ్చారన్నారు. ఆయన నుంచి తాము ఎంతో నేర్చుకున్నామన్నారు. తామేమీ దేవుళ్లం కాదని.. అందరి లాంటి మనుషులమేనని.. ప్రతి చోట గొడవలు రావటం సహజమన్నారు.

రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వమని.. ఆయన మనసులో ఏదీ దాచుకోవటం తెలీదన్నారు. ఎవరూ ఎవరినీ మోసం చేయలేదని.. గొడవలు.. తగాదాలు రావటం సహజమన్నారు. దాచుకోవాల్సిన అవసరంలేదని.. దాచుకోవటానికి ఏమీ లేదని జీవిత వ్యాఖ్యానించారు. మొత్తానికి చిరును ప్రసన్నం చేసుకునేలా జీవిత మాటలు ఉండటం గమనార్హం.
Please Read Disclaimer