పదవి నుంచి దిగటానికి సిద్ధమంటూ మళ్లీ కెలికిన నరేశ్

0

రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు ఉంటాయని చెప్పక తప్పదు. రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ‘‘మా’’ ఎన్నికలు జరుగుతున్న వైనం ఈ మధ్యన చూస్తున్నదే. ఈ మధ్యన జరిగిన ఎన్నికల అనంతరం మా అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నిక కావటం.. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారే తప్పించి.. అసోసియేషన్ పనుల్లో యాక్టివ్ గా లేరన్న విమర్శల్ని మూట గట్టుకున్నారు.

ఇండస్ట్రీలో ఎవరైనా సరే.. వారి తప్పుల్ని ఎత్తి చూపించే విషయంలో జీవితా రాజశేఖర్లు అస్సలు తగ్గరన్న సంగతి తెలిసిందే. ఇటీవల నరేశ్ మీద విమర్శలు చేసిన ఈ జంటకు పని కల్పించేలా తాజాగా నరేశ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విడుదలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న నరేశ్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవటానికి తాను ఈ క్షణం కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే.. తనను ఎవరూ బయటకు పంపలేరని వ్యాఖ్యానించారు. తాను సభ్యుల ఓట్లతో అధ్యక్షుడ్ని అయినట్లు చెప్పుకున్న నరేశ్.. తనకు ‘‘మా’’లో శత్రువులు ఎవరూ లేరన్నారు.

తమది రాజకీయ పార్టీ కాదని.. సేవా సంస్థగా భావించాలన్న ఆయన.. చిరంజీవి.. కృష్ణంరాజు మురళీమోహన్ లాంటి పెద్దల సహకారంతో అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. అలాంటివేళ.. వివాదాలకు తావిచ్చేలా.. ఎదుటోళ్లను కెలికేలా వ్యాఖ్యలు ఎందుకు నరేశ్ అన్న ప్రశ్న తలెత్తక మానదు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్నెల్ల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టినట్లుగా నరేశ్ వ్యాఖ్యానించారు. నరేశ్ తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఇలాంటి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొనే జీవితా రాజశేఖర్ చేతికి.. నోటికి పని చెప్పినట్లుగా చెప్పక తప్పదు.
Please Read Disclaimer