రాక్షసి హీరో ఇలా అయ్యాడేంటి ?

0

సినిమా పరిశ్రమలో కెరీర్లను టాలెంట్ తో పాటు టైం కూడా డిసైడ్ చేస్తుంది. అదే మనల్ని ఏ తీరానికి చేర్చాలో అక్కడికి తీసుకెళ్తుంది. అందాల రాక్షసి ద్వారా ఇండస్ట్రీ దృష్టిలో పడ్డ ముగ్గురిలో రాహుల్ రవీంద్రన్ నటుడిగా దర్శకుడిగా ప్లానింగ్ తో ఆలా చేసుకుంటూ పోతుండగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొంత కాలం కెరీర్ ని ఎంజాయ్ చేసి ఇటీవలే సైలెంట్ అయ్యింది. ఇక నవీన్ చంద్ర పరిస్థితే అటు ఇటు కాకుండా అయిపోయింది.

నిజానికి అందాల రాక్షసిలో బాగా హై లైట్ అయిన క్యారెక్టర్ నవీన్ చంద్రదే. మౌనరాగంలో కార్తీక్ రేంజ్ లో పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ సక్సెస్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. సోలో హీరోగా చేసిన సినిమాలు వరసబెట్టి టపా కట్టాయి. ఇటీవలే అరవింద సమేత వీర రాఘవలో విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు. రెస్పాన్స్ బాగానే వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం ఆ స్థాయిలో లేవు. మరోవైపు హీరోగా ఓ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ బిజినెస్ కారణాల వల్ల అవి ల్యాబ్ దాటి బయటికి రావడం లేదు.

రేపు రిలీజ్ కానున్న ఎవరులో సైతం నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించాడు కానీ పోస్టర్లు ప్రమోషన్లలో ఈవెంట్లలో ఎక్కడా చూసినా అడవి శేష్ రెజీనాలే కనిపిస్తున్నారు. వాళ్ళ గురించే ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఇలా తెరమీదే కాక బయట కూడా నవీన్ చంద్రకు సినిమా కష్టాలు చుట్టుముట్టినట్టు ఉన్నాయి. నిజానికి కుర్రాడిలో ప్రతిభ ఉన్నా అవి బయటికి తీసే కథలు దొరక్కపోవడంతో ఆఖరికి హీరోగా విలన్ గా కెరీర్ ని ఎటూ తిప్పలేక త్రిశంకు స్వర్గంలో నిలబెడుతున్నట్టున్నాడు.
Please Read Disclaimer