అఫీషియల్: నయనతార ఓపెన్ అయ్యింది

0

గత రెండు రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న రాధారవి వివాదం గురించి నయనతార ఓపెన్ అయ్యింది. రెండు రోజుల క్రితం తాను అటెండ్ కాని ఓ సినిమా ఫంక్షన్లో అసభ్యకర రీతిలో కామెంట్స్ చేసిన రాధారవి మీద ఇప్పటికే చాలా మంది ఆర్టిస్టులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. డిఏంకే పార్టీ ఏకంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నయన్ కాబోయే భర్త విజ్ఞేశ్ శివన్ స్పందించినప్పటికీ తను మాత్రం సైలెంట్ గా ఉంది. ఇందాక ప్రెస్ నోట్ రూపంలో స్పందించింది. దాని పూర్తి పాఠం ఇదే

“నేను సాధారణంగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వను. నేను కాదు నా వృత్తి మాట్లాడాలి అనేదే నా స్వభావం. కాని కొన్ని అనివార్య పరిస్థితులు ఇలాంటివాటికి దారి తీస్తాయి. పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న దుర్భర స్థితిలో నేను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ముందుగా ఇది తెలిసిన వెంటనే రాధారవి మీద చర్యలకు పూనుకున్న డిఏంకే ప్రెసిడెంట్ స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

రాధారవి లాంటి వాళ్ళు తమ జన్మ తల్లి అనే ఆడది నుంచే జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మగాళ్ళ మధ్య భయంతో మనుగడ సాగిస్తున్న మహిళల పట్ల నాకు సానుభూతి కలుగుతోంది. రాధారవి లాంటి వాళ్ళు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పోయి ఇలా దిగజారడం విషాదం. ఇలాంటి చీప్ పాపులారిటీ కోసం పాకులాడే రాధారవి లాంటి వాళ్ళతో సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.

హేయమైన విషయం ఏంటంటే ఇలాంటి మగాళ్ళు మాట్లాడే తప్పుడు ప్రేలాపనలకు ప్రశంశలు చప్పట్లు అందించే కొందరు మన చుట్టే ఉండటం. ఇలా జరుగుతున్నంత కాలం రాధారవి లాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సందర్భంగా నా మీద మహిళా లోకం మీద రాధారవి అన్న మాటలను ఈ రూపంలో తీవ్రంగా ఖండిస్తున్నాను.

దేవుడు నాకు తమిళ ప్రేక్షకుల రూపంలో గొప్ప జీవితాన్ని అందుకునేలా చేసాడు. మంచి అవకాశాలు వచ్చేలా దీవించాడు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా నేను సీతగా దెయ్యంగా దేవతగా స్నేహితురాలిగా భార్యగా ప్రేయసిగా నటిస్తూనే ఉంటాను. నా అభిమానులు అందించే వినోదానికి లోటు లేకుండా చూసుకుంటూనే ఉంటాను

చివరిగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం)నేను అడగాలనుకున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పటికైనా అంతర్గత ఫిర్యాదు విచారణ కమిటీని పునరుద్ధరిస్తారా. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ విశాఖ గైడ్ లైన్స్ మేరకు చర్యలు చేపట్టే విధంగా ఇలాంటి సంఘటలకు విచారణ చేస్తారా ?

మరొక్కసారి ఈ నాకు అండగా నిలిచి ఈ విపత్కాల సమయంలో మద్దతు తెలిపిన మంచి మనసున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇక పనికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది
దేవుడి దయతో మీ అందరి ఎనలేని ప్రేమాభిమానాలతో

నయనతార”
Please Read Disclaimer