ఎన్ బీకే 105 దసరా లుక్

0

నటసింహా నందమూరి బాలకృష్ణ – కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ బీకే 105 గా ప్రస్థావిస్తున్నారు. హ్యాపీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి గ్యాంగ్ స్టర్ గా మారడానికి కారణమేంటి? అన్నది తెరపై చూపిస్తున్నారన్నది అభిమానుల ముచ్చట.

బాలయ్య సూటు బూటులో క్లాస్ గా ఉన్న పోస్టర్లను ఇదివరకూ లాంచ్ చేశారు. ఫ్రెంచి గడ్డంతో అతడి లుక్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. తాజాగా దసరా కానుకగా ఎన్ బీకే 105 కొత్త పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య రక్తమోడుతున్న కత్తి చేతపట్టి కనిపించారు. ఓవైపు రంగుల పండగ సంబరంగా జరుగుతుంటే బంతిపూల లోగిళ్లతో సందడిగా వేడుక జరుగుతుంటే.. బాలయ్య ఏంటిలా.. అక్కడ ఊచ కోత కోశారు? అన్నట్టుగానే ఉందీ ఫోజు. అయితే ఆ సందర్భం ఏమిటో దర్శకుడే చెప్పాల్సి ఉంటుంది. కె.ఎస్.రవికుమార్ గత యాక్షన్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాని మసాలా అంశాలతో తెరకెక్కిస్తున్నారని తాజాగా రివీలైన పోస్టర్ చెబుతోంది.

లుక్ పరంగా బాలయ్య మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఆయన సరికొత్తగా మారిపోయారు. గౌతమిపుత్ర శాతకర్ణి.. పైసావసూల్ చిత్రాల్లో వైవిధ్యంగా కనిపించిన బాలయ్యను ఈసారి కూడా అంతే కొత్తగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. అయితే పోస్టర్ తో పాటే టైటిల్ ని ప్రకటిస్తారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాకు రూలర్.. క్రాంతి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని వినిపిస్తోంది. మరి వీటిలో ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారు? అన్నది చూడాలి. సోనాల్ చౌహాన్.. వేదిక ఇందులో నాయికలుగా నటిస్తున్నారు. మరో సీనియర్ నటి భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.