లిరిసిస్ట్ ని బుక్ చేసిన ‘జై శ్రీరామ్’

0

దేశంలో మూకదాడుల విషయమై జాతీయ స్థాయిలో డిబేట్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. `జై శ్రీరామ్` పేరుతో మూకదాడులకు పాల్పడుతున్నారని.. ఈ సంస్కృతి అంత మంచిది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. దాదాపు 50 మంది సినీసెలబ్రిటీలు ఈ దాడుల్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సంతకాలు చేశారు. అయితే దీనిపై పాటల రచయిత అనంత శ్రీరామ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల్ని పలువురు తూర్పారబట్టడం చర్చకొచ్చింది. సమస్యపై అవగాహన లేకుండా రాతలు రాయొద్దని చీవాట్లు పెడుతూ కొందరు ఘాటైన విమర్శలు చేయగా కొందరు మాత్రం ఆయన్ని సమర్థించారు.

“నకిలీ మేథావులు మళ్ళీ సకిలించారు.. కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై.. ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట. ఏముందయ్యా అంటే `జై శ్రీరాం` అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయంట అందువల్ల ఆ పదం .. వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన .. బాధ్యత ప్రధానమంత్రిదేనట . అంటే ఆ మహాశయులు ఇప్పుడేమంటారు `జై` అన్న పదాన్ని.. `శ్రీరాం` అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా?“ అంటూ సుదీర్ఘంగా గేయం తరహాలో ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారు అనంత శ్రీరాం. అయితే మూక దాడుల ఖండన విషయంలో ఈ లిరిసిస్ట్ అపార్థం చేసుకున్నారని.. అందులో అసలు అర్థాన్ని ఆయన పెడదారి పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

“మీరు నిజంగా మేధావి సోదరా.. ముకదాడుల ని హత్యలను అపాల్సిన బాధ్యత సర్కార్ ది కదా.. వాటిని అపమన్నారు ఆ పెద్దలు. దాన్ని మీరు రాముల వారి మీద డైవర్ట్ చేసారు.. ఇది బాలేదు!“ అని వ్యాఖ్యానించారు ఓ నెటిజన్. “మీ కళ్ళ జోడు మార్చి వారి అభ్యర్ధన చదవగలరు. ఎంత సేపటికి పాటలు వింటూ పాడుకుంటూ ఉంటాం కొంత ఆపేసి రోజూ కొంత సమయం వార్తాపత్రికలు తిరగేస్తే అసలు విషయం బోధపడుతుంది“ అంటూ వేరొకరు కామెంట్ చేశారు. “నీకు విషయం మీద పూర్తిగా అవగాహన లేదని అర్ధమవుతుంది… నువ్వు తప్పించి మిగతా వారు నకిలీ మేధావులని అహంభావం వద్దు. ఎన్నో వేల పాటలు రాసిన వేటూరి గారు కూడా ఇలా నోరు జార లేదు“ అని ఒక పెద్దాయన వ్యాఖ్యానించారు.

“జై శ్రీ రామ్.. ఈ పోస్టు పెట్టే ముందు ఇక్కడ ఉన్న కొన్ని విదేశీ సానుభూతి పరులు ఉదారమైన కామెంట్స్ చేస్తారని అనంత శ్రీ రామ్ ఊహించే ఉంటారు. అటువంటి కామెంట్స్ ఆయన పోస్టు విలువను మరింత పెంచింది“ అంటూ వేరొకరు అనంత శ్రీరామ్ ని సమర్థించడం ఆసక్తిని కలిగించింది. “ఎన్నో హత్యలకు ఎలాంటి పదాలు సాక్ష్యమో ఎవరికీ గుర్తులేదు కానీ ఇప్పుడు రామనామం తలచుకోగానే బుద్ధి వికసించింది. ప్రేమ పేరుతో ఎంతో మంది ఉసురు తీసుకున్ననపుడు పెగలని నోళ్లకు నాలుకొచ్చింది“ అన్న వ్యాఖ్యానం కామెంట్ బాక్స్ లో కనిపించింది. ఒకరిద్దరూ అనంత శ్రీరామ్ వ్యాఖ్యల్ని సమర్థించినా మెజారిటీ భాగం నెటిజనులు వ్యతిరేకించారు.
Please Read Disclaimer