ఆ విదేశీ ఓటీటీని బాయ్ కాట్ చేయండంటూ నినాదాలు

0

ఓటీటీ సినిమాలు శ్రుతి మించుతున్నాయా? సెన్సార్ షిప్ లేకపోవడంతో ఇష్టానుసారం ఓటీటీ సినిమాల్ని తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారా? అంటే .. అవుననే సమాధానం వినిపిస్తోంది. వివాదాలు.. పెచ్చుమీరిన విశృంఖలత్వం.. మనోభావాల్ని దెబ్బ తీయడం ఈ వేదికపై పరాకాష్టకు చేరుకుంటోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. బుల్లితెర సీరియళ్లకు లేని స్వేచ్ఛ ఓటీటీ సినిమాలకు ఉంది! అనడానికి ఇటీవల ఓటీటీ కంటెంట్ ఫక్తు ఎగ్జాంపుల్.

ఇప్పటికే పలు ఓటీటీ సినిమాలపై తీవ్ర వివాదాలు చెలరేగాయి. తాజాగా `కృష్ణ అండ్ హిజ్ లీలా` హిందూ మనోభావాల్ని దెబ్బ తీసింది అంటూ వివాదం చెలరేగింది. ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ ని బాయ్ కాట్ (#BoycottNetflix ) చేయాలి అంటూ హ్యాష్ ట్యాగ్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమా నిర్మాత అయిన రానాకు అక్షింతలు తప్పడం లేదు.

జూన్ 25 రిలీజ్ డే మొదలు క్రిటిక్స్.. నెటిజనుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రంలో కృష్ణ అనే కథానాయకుడిని మగువలతో పెచ్చుమీరిన శృంగారం సాగించేవాడిగా చూపించారు. పైగా అతని స్నేహితురాల్లో ఒకరికి రాధా అనే పేరు పెట్టడం అవమానపరచడమేనంటూ పలువురు నెటిజనులు ఆరోపించారు. ఇలాంటి చెత్త సినిమాలు తీసేప్పుడు ఆలోచించాలి అంటూ రానా దగ్గుబాటిపై తిట్ల వర్షం కురిపించారు.సినీరంగంలో ఏదీ భరించలేనిదిగా ఉంది. ప్రజల మనోభావాల్ని కించపరుస్తున్నారు! అంటూ పలువురు నిప్పులు కురిపించారు. హిందూ మతాన్ని అబాసుపాలు చేస్తూ ఎన్నో అబద్ధాల్ని మోసపూరితంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా చేసుకున్నారా? ఎంత ధైర్యం? అంటూ ఓ నెటిజనుడు ప్రశ్నించారు.

“మన దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ముప్పయ్ శాతం వాటా శృంగార వెబ్ సైట్లదే. ఈసారి నెట్ ఫ్లిక్స్ పరిమితులను దాటింది. హిందు దేవతలను అవమానించే వెబ్ సిరీస్ లను వారు ప్రోత్సహిస్తున్నారు. కోర్టులే వీటిని నిషేధించాలి“ అంటూ ఒక నెటిజనుడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న బుల్ బుల్ లో బెంగాలీ జానపదగీతం `కొలోంకిని రాధా…` వివాదాస్పదం అయ్యింది. ఈ పాటలోని పదజాలం వివాదాస్పదం అయ్యింది. ఇలాంటి ఎన్నో విషయాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు #BoycottNetflix అన్న డిమాండ్ ని పీక్స్ కి తీసుకెళుతున్నారు. హిందువుల మనోభావాల్ని కించపరిచే లేదా మన సాంప్రదాయాన్ని భూస్థాపితం చేయాలనుకుంటున్న విదేశీ కార్పొరెట్ ని తొక్కేయాలన్నది హిందువుల వాదన. మరి ఇది నెరవేరుతుందా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer