ఇంకా చాలా బెటర్ మెంట్ కావాలి బ్రదర్

0

అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు సరిపోతుందని అంటారు. కానీ కళారంగంలో అంత సులువుగా చెప్పేయడం కుదరదు. ఇక్కడికి వచ్చే వాళ్లలో ఆరంగేట్రమే ఎంతో ప్రతిభతో అన్ని రకాలా ప్రాక్టీస్ తో వస్తుంటారు. కొందరికి శిక్షణ సరిపోకపోవచ్చు. మరికొందరు ఎలాంటి శిక్షణ లేకుండా వస్తుంటారు. అయితే అలా వచ్చిన వాళ్లలో చాలా మంది అగ్ర తారలుగా ఎదిగిన వాళ్లు ఉన్నారు. కొందరికి చిన్నపాటి తప్పు ఒప్పుల్ని సరిచేస్తే పెద్ద స్టార్లు అయ్యే అవకాశం ఉంటుంది.

రౌడీ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తన కెరీర్లో చాలా ప్రారంభంలో ఉన్నాడు. నటుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నందున అతను ఒక నిర్దిష్ట మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిభ పరంగా ఇంకా సాన బట్టాల్సిన ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. ఈ విషయంలో అన్న విజయ్ దేవరకొండ సలహాలు సూచనలు చాలా వరకూ కలిసొస్తాయనడంలో సందేహమేం లేదు.

ప్రస్తుతం దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కోసం సొంతంగా అనువాదం చెప్పుకున్నారట. ఆ గొంతు వినగానే స్వరాల్లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఆనంద్ తన శైలిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిదీ మెరుగులద్దుకుంటే హీరోగా రాణించేందుకు ఆస్కారం లేకపోలేదు.

ఒక్కోసారి విజయ్ ని పోలినట్టు వాయిస్ అనుకరణ ఉన్నా ఇబ్బందికరమే అన్న విశ్లేషణ సాగుతోంది. అనుభవంలో బాడీ లాంగ్వేజ్ సహా ప్రతిదీ మార్చుకున్న హీరోలు మనకు ఉన్నారు. ఇక గొంతు సవరించుకుని డబ్బింగ్ పరంగా మెరుగైన హీరోలు ఉన్నారు. ఆరంభం సుధీర్ బాబు వాయిస్ పైనా తీవ్ర విమర్శలొచ్చాయి. కాలక్రమంలో అతడు చాలా మారాడు. మొన్న `వి`లో వంద శాతం పర్ఫెక్షన్ తో అతడి స్టైల్ కానీ వాయిస్ కానీ మెరుపులు మెరిపించేయడం చర్చకు వచ్చింది.

కథల ఎంపికలు ఇతర విషయాల్లో సోదరుని సాయం ప్రమేయం ఉన్నా కానీ నటన ఆహార్యం వాచకం వగైరా వగైరా స్వయంకృషితోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆనంద్ ఎలాంటి కృషి చేస్తారో ఎలాంటి మార్పులు బెటర్ మెంట్ చూపిస్తారో చూడాలి.