బుట్ట బొమ్మ ప్రోమో: బన్నీ డ్యాన్సులు.. పూజ అందాలు

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈ ఆడియో ఆల్బమ్ లోని రాములో రాముల.. సామజవరగమన.. బుట్టబొమ్మ పాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ‘అల వైకుంఠపురములో’ టీమ్ బుట్టబొమ్మ పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు.

దాదాపు నిముషం నిడివి ఉండే ఈ వీడియో సాంగ్ లో స్టైలిష్ స్టార్ తన స్టెప్పులతో మ్యాజిక్ చేశారు. మెట్లపై చదునుగా ఉన్న ఉపరితలంపై కిందకు జారుతూ బన్నీ వేసే స్టెప్ చూస్తె ఎవరైనా బన్నీకి ఫ్యాన్ గా మారిపోవాల్సిందే. గోడను ఆనుకుని పైకి లేస్తూ వేసే మరో స్టెప్ కూడా అదిరిపోయింది. బన్నీ మరోసారి తన డ్యాన్స్ కు ఎవరూ సాటిలేరని నిరూపించారు. మరోవైపు ఈ పాట కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ అద్భుతం గా ఉంది. హీరోయిన్ పూజ హెగ్డే చిట్టి పొట్టి పింక్ గౌన్లో బార్బీ బొమ్మ తరహా లో కనిపించింది. పూజ ముందు బన్నీ తనమోకాలిపై అలా కూర్చున్నట్టు కూర్చుని పూజ పైకి అందంగా పూలు విసరడం.. దానికి స్పందనగా పూజ చిరునవ్వులు చిందించడం కూడా ఈ ప్రోమోలో ఒక ప్రత్యేకత. ఇక చిట్టి పొట్టి గౌన్లు వేసుకోవడంతో పూజ కాళ్ల అందాలు హైలైట్ అయ్యాయి. అదేంటో ఈమధ్య గురూజీలో కూడా చిలిపిదనం ఎక్కువైనట్టుగా ఉంది.. హీరోయిన్ల లోని గ్లామర్ కోణాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను మాయలో పడేస్తున్నారు.

ఒక పాట వినడానికి బాగుండడం ఒక ఎత్తైతే దాన్ని మించినట్టు గా చిత్రీకరించడం మరో ఎత్తు. ఈ పాటకు ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా అన్నీ కుదిరాయని అనిపిస్తోంది. థియేటర్లో ఈ పాట ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయమని తేలిపోయినట్టే. ఆలస్యం ఎందుకు.. బుట్టబొమ్మ ప్రోమోను చూసేయండి.
Please Read Disclaimer