వలస కూలీల ఆకలి తీరుస్తున్న నిధి అగర్వాల్…!

0

ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిల్లాడిపోతోంది. దీని వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. దీని వలన రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. బ్రతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇప్పుడు అక్కడ పనులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడ చూసినా వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తున్నాయి. రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడంతో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అంత దూరం సైకిళ్లు మీద వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోడానికి సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడుతున్నారు.

ఇప్పుడు తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ వలస కూలీల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. స్వయంగా తన ఇంట్లో సాండ్ విచ్ లను తయారు చేసి కాలి నడకన స్వగ్రామాలకు పయనమైన వలస కూలీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. నిధి అగర్వాల్ ఇలా తన మంచి మనసుని చాటుకుని ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇంతకముందు కూడా కరోనా భాదితుల సహాయార్థం నిధి పలు ఛారిటీలకు విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఎంత విరాళం ఇచ్చిందో చెప్పకపోయినా పీఎం కేర్ ఫండ్.. వెల్ఫేర్ అఫ్ స్ట్రే డాగ్స్.. కరోనా క్రైసిస్ ఛారిటీ.. సీఎం రిలీఫ్ ఫండ్.. స్ఫూర్తి సంక్షేమ సేవా సంఘ్ మొదలైన వాటికి కంట్రిబ్యూట్ చేసినట్లు నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన మంచి మనసుని చాటుకుని అందరి హృదయాలను గెలుచుకుంది. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఒక సినిమాలో.. తమిళ్ లో జయం రవి సరసన ‘భూమి’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన సూపర్ స్టార్ సూపర్ హిట్ సాంగ్ ‘జుంబారే జుమ్ జుమ్ జుంబారే’ రీమేక్ సాంగ్ కి అశోక్ గల్లాతో కలిసి స్టెప్పులేసి అలరించింది.
Please Read Disclaimer