నిహారికకు క్రేజీ ఆఫర్?

0

మెగా ఫ్యామిలీనుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయి నిహారిక. నాగేంద్రబాబు తనయగా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారికకు ఎందుకో కానీ విజయం దక్కలేదు. నిహారిక ఇప్పటి వరకూ ‘ఒక మనసు’.. ‘హ్యాపీ వెడ్డింగ్’.. ‘సూర్యకాంతం’ చిత్రాలలో నటించింది. అయితే అవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందంటూ ఈమధ్య వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఆ వార్తలపై నిహారిక ఇంతవరకూ స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక నెక్స్ట్ సినిమా గురించి ఫిలిం నగర్ లో ఓ కొత్త గాసిప్ వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో నిహారిక నటిస్తోందని సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాలోనే ఒక కీలక పాత్ర ను నిహారికకు ఆఫర్ చేశారని టాక్. అల్లు అర్జున్ స్వయంగా నిహారికతో పాత్ర గురించి చర్చించాడని.. నటించాల్సిందిగా కోరాడని అంటున్నారు. దీంతో నిహారిక సంతోషంగా ఒకే చెప్పిందని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయితే నిహారికకు మంచి ఆఫర్ దక్కినట్టే.

ఈ సినిమా ఆఫర్ సంగతి పక్కన పెడితే నిహారిక ప్రస్తుతం వెబ్ సీరీస్ ల నిర్మాణం చేపట్టాలని సన్నాహాలు చేస్తోందట. చాలారోజుల క్రితమే నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ను స్థాపించింది. ఈ బ్యానర్ పైనే ఇప్పుడు మంచి కంటెంట్ ఉండే వెబ్ సీరీస్ లను నిర్మించే ప్రయత్నాలు చేస్తోందట. మంచి పాత్ర ఉంటే వాటిలో నటించేందుకు కూడా ప్లాన్ చేస్తోందట. గతంలో ‘ముద్దపప్పు ఆవకాయ్’.. ‘నాన్నకూచి’ అనే వెబ్ సీరీస్ లలో నిహారిక నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer