‘కార్తికేయ -2’ సీక్వెల్ కథతో కాదా?

0

నవ్యపంథా కథల్ని ఎంచుకుని ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ తో మెప్పించడం యువహీరో నిఖిల్ శైలి. స్వామి రారా- కార్తీకేయ- సూర్య వర్సెస్ సూర్య- ఎక్కడికి పోతావు చిన్నవాడా? .. ఇవన్నీ ఆ తరహానే. ప్రతిసారీ జోనర్ మార్చి ప్రయోగాలు చేసే సత్తా నిఖిల్ కి ఉంది. ఇమేజ్ చట్రంలో ఇమిడికుండా తెలివైన ఎంపికలతో స్టార్ రేస్ లోకి దూసుకొచ్చిన ఈ యంగ్ హీరోకి ఇటీవల బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పాలి.

కొన్ని వరుస హిట్లు అందుకున్న తర్వాత కూడా తాజా చిత్రం `అర్జున్ సురవరం`ని రిలీజ్ చేయడంలో తడబడ్డాడు. ఈ సినిమా రకరకాల కారణాలతో అంతకంతకు వాయిదా పడడం అతడి భవిష్యత్ ప్రణాళికలకు అడ్డంకిగా మారింది. ఈ మూవీ రిలీజ్ వాయిదా ప్రభావం తదుపరి సినిమాలపై పడింది. కొత్త సినిమాని ప్రారంభించ కుండా నిఖిల్ వెయిట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. `అర్జున్ సురవరం` సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. `సాహో` రిలీజయిన తర్వాతే రిలీజ్ ఉంటుందని నిఖిల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందుకు ఎలానూ మరో రెండు నెలల సమయం ఉంది కాబట్టి.. ఈలోగానే చందుమొండేటి దర్శకత్వంలో `కార్తికేయ 2`ని ప్రారంభించే ఆలోచనలో నిఖిల్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. కార్తికేయకు ఇది సీక్వెల్ సినిమా కాదు. పూర్తి కొత్త కథతో అదే జోనర్ లో ఉంటుందట. వినోదం పరంగా ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు గా కథని తీర్చిదిద్దారని తెలుస్తోంది. అన్ని డైలమాల నుంచి బయటపడి తదుపరి ప్రాజెక్టు పై నిఖిల్ దృష్టి సారిస్తే అభిమానులకు అది శుభవార్తనే. చందు మొండేటి టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Please Read Disclaimer