సెంటిమెంట్ కూరుతున్న నిఖిల్

0

ఇటీవల చాలా సినిమాలు వాయిదా పద్ధతిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో యువహీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం రకరకాల కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రానికి తొలుత ముద్ర అనే టైటిల్ నిర్ణయించారు. ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన వేరొక ప్రొడక్షన్ కంపెనీ ససేమిరా అనడంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. కారణం ఏదైనా అర్జున్ సురవరం టైటిల్ ని ప్రకటించి తదుపరి ప్రచారంలో వేడి పెంచేందుకు నిఖిల్ టీమ్ ప్రయత్నించారు.

మార్చి 29న `అర్జున్ సురవరం` రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రాన్ని మే 1కి వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా సినిమాల్లో వాయిదా పద్ధతిలో రిలీజైనవి సూపర్ హిట్లు కొట్టాయి. కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడా? వాయిదా పడే వచ్చాయి.. సూపర్ హిట్లు కొట్టాయి. ఈసారీ అలానే జరుగుతోంది. అర్జున్ సురవరం సూపర్ హిట్ కొడుతుంది’ అని వ్యాఖ్యానించారు.

అర్జున్ సురవరం లో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో బాధ్యతాయుతమైన జర్నలిస్టు పాత్రలో నటించాను. అలాంటి పాత్రలో నటించడం సాహసంతో కూడుకున్నది. అలాగే ఇందులో మీడియా గురించి పాజిటివ్ విషయాలతో పాటు నెగెటివ్ విషయాల్ని చర్చించామని తెలిపారు. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ `కణిథాన్` కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన టి.ఎన్.సంతోష్ తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో ఆరా సినిమాస్- మూవీ డైనమిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.




Please Read Disclaimer