నిఖిల్ కండల్లో హిట్టు ముద్ర!

0

వరసబెట్టి సినిమాలు చేసేందుకు తొందరపడకుండా వైవిధ్యతకు చోటిస్తూనే తనకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకునే నిఖిల్ కొత్త సినిమా ముద్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కిరాక్ పార్టీ తర్వాత కాస్త స్లో అయిన నిఖిల్ ముద్ర కోసమే తన ఒళ్ళు పెంచే పనిలో బాగా కసరత్తులు చేసి పాత్ర డిమాండ్ మేరకు కొత్త ఫిజిక్ లోకి మారిపోయాడు. వాటి తాలూకు స్టిల్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. తమిళ బ్లాక్ బస్టర్ కనితన్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంజనీరింగ్ చదివినా టీవీ జర్నలిస్టు వృత్తిని ఎంచుకునే పాత్రలో నిఖిల్ ఇందులో చాలా కొత్తగా కనిపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. వర్తమాన సమాజాన్ని పీడిస్తున్న కీలకమైన సమస్యను థ్రిల్లర్ తరహాలో రూపొందిస్తున్నట్టు తెలిసింది. కంటెంట్ మీద చాలా నమ్మకమున్న నిఖిల్ ఇందులో చాలా రిస్కీ ఫైట్స్ చేస్తున్నాడు. మొన్న డూప్ లేకుండా ఎత్తైన బిల్డింగ్ కిటికీలపై నిఖిల్ చేసిన స్టంట్ తాలూకు ఫోటో ట్విట్టర్ లో బాగా వైరల్ అయ్యింది.

టాగోర్ మధు నిర్మిస్తున్న ముద్ర షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ మొదలుపెట్టి రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. ఇప్పుడున్న హీరోలు బాడీ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో నిఖిల్ కూడా టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. ముద్ర ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిఖిల్ కు అభిమానుల నుంచి ఈ మధ్యకాలంలో తరచుగా ఎదురయ్యే ప్రశ్న ముద్ర విడుదల గురించే. కాస్త ఓపిక పట్టమని మెప్పించే విషయమున్న కాన్సెప్ట్ కాబట్టే క్వాలీటిలో రాజీ పడటం లేదని వాళ్లకు అభయమిస్తున్నాడు. జస్ట్ ఒక్క ఏడాదిలోనే నిఖిల్ లో వచ్చిన శారీరక మార్పు చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.