‘టిక్ టాక్’ బ్యాన్ చేయడంపై స్పందించిన టాలీవుడ్ యువ హీరోలు…!

0

భారత సార్వభౌమాధికారం సమగ్రత శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందంటూ టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధిస్తూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సినీ రాజకీయ ప్రముఖులు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయడంపై స్పందించారు.

‘టిక్ టాక్’ ని బ్యాన్ చేయడంపై నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ”వారు మన దేశాన్ని గౌరవిస్తున్నంత కాలం మన జీవితం మరియు ప్రజాస్వామ్యం ‘కాలం’లో టిక్ టాక్ ని నిషేధించకూడదు… #tiktokbanindia” అని పేర్కొన్నారు. ఇక నిఖిల్ ట్వీట్ పై మరో యువ హీరో సందీప్ కిషన్ స్పందించారు. ”నా ఇన్స్టెంట్ రియాక్షన్ కూడా అదే మామా.. కానీ ఈ యాప్స్ ని నిషేధించడం అనేది అవసరమైన బోల్డ్ మూవ్.. చైనా ప్రభుత్వం చేస్తున్నది దారుణం.. మనం ఉపాధిని కోల్పోతున్నాము. మన దృష్టిలో మంచిదే. కానీ జాతీయ భద్రత దృష్టిలో ఉంచుకుని చూస్తే అనుషంగిక నష్టంగా భావించవచ్చు..” అని ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ .. ”సరిగ్గా నా పాయింట్ అదే మామా … నువ్వు తప్పకుండా మళ్ళీ నా ట్వీట్ చదవాలి. దానిలోని వ్యంగ్యం హాలోతో ఈ హ్యాష్ ట్యాగ్ ను పెట్టాను #BanChineseProducts” అని వివరణ ఇచ్చాడు. దీనికి ”సారీ.. అది నేను చూసుకోలేదు” అని సందీప్ రిప్లై ఇచ్చాడు.

అంతేకాకుండా ”2020 జనవరిలో టిక్ టాక్ ని 75 బిలియన్ డాలర్ల కంపెనీగా అంచనా వేశారు. చైనాలో అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరు… మనపై దాడి చేస్తున్న ఒక దేశానికి మనం చాలా ఎక్కువ నిధులు సమకూరుస్తున్నాము.. ఇది వాస్తవానికి మంచి భద్రత మరియు గోప్యతా లక్షణాలను కలిగి ఉంటే మంచి కూల్ యాప్ అవుతుంది.. వారు ఇండియాను కోల్పోవడం దురదృష్టకరం” అని మరో ట్వీట్ చేసారు సందీప్ కిషన్. ఇదిలా ఉండగా జాతీయ భద్రత మరియు గోప్యతా సమస్యలపై చైనా యాప్స్ బ్లాక్ చేసిన తర్వాత స్పష్టత ఇవ్వమని ప్రభుత్వం ఆహ్వానించినట్లు టిక్ టాక్ ఇండియా తెలిపింది. ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్ ప్రభుత్వ ఉత్తర్వులను పాటించే ప్రక్రియలో ఉందని మరియు భారత చట్టం ప్రకారం డేటా గోప్యత మరియు భద్రతా అవసరాలకు అనుగుణంగానే పని చేస్తోందని టిక్ టాక్ ఇండియా వెల్లడించింది.
Please Read Disclaimer