నిన్నే నిన్నే: రొమాంటిక్ ఫీల్ తో సాగుతోందే

0

యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ‘అశ్వథ్థామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రమణ తేజ రూపొందిస్తున్న ఈ సినిమాను శౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 31 వ తేదీన విడుదల చేస్తామని ఈమధ్యే ప్రకటించారు. రిలీజ్ వచ్చేనెలలోనే కాబట్టి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

కాసేపటి క్రితం ఈ సినిమా నుండి ‘నిన్నే నిన్నే’ అంటూ సాగే మొదటి వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. ఈ పాటకు సాహిత్యం అందించినవారు రమేష్ వాకచర్ల. అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడారు. “నిన్నే నిన్నే యదలో నిన్నే చెలియా నీకై నేనే వేచానులే అలుపే రాదే అదుపే లేదే. అయినా సమయం సరిపోదులే.. ” అంటూ ప్రియురాలి గురించి ప్రియుడు పాడే పాట ఇది. మంచి రొమాంటిక్ ఫీల్ తో సాగింది. నాగశౌర్య- మెహ్రీన్ ల జోడీ ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ అందంగా ఉన్నాయి. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.

ఈమధ్య ఒక సినిమాకు మంచి హైప్ తీసుకురావడానికి పాటలు చాలా కీలకం అయ్యాయి. ఆవిధంగా చూస్తే ‘అశ్వథ్థామ’ సినిమాకు ఈ పాట మంచి స్టార్ట్ అనే చెప్పాలి. మిగతా పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటే ‘అశ్వథ్థామ’ కు మంచి క్రేజ్ రావడం ఖాయం.
Please Read Disclaimer