వెటర్నరీ డాక్టర్ హత్య..నిర్భయ తల్లి స్పందన

0

2012లో దేశరాజధాని ఢిల్లీలో ‘నిర్భయ’ను అత్యాచారం చేసి హత్యచేసిన వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె పేరుమీదనే కేంద్రం ‘నిర్భయ’ చట్టం తెచ్చి ఆడపిల్లలకు రక్షణ సౌకర్యాలను కల్పించింది.

ఈ నిర్భయ మరణం తర్వాత సరిగ్గా 7 సంవత్సరాలకు కోర్టులో నిందితులపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికీ వారికి తుది శిక్ష పడలేదు. తన కూతురు నిర్భయను అత్యాచారం చేసి చంపిన వారికి శిక్ష పడుతుందని ఏడు సంవత్సరాలు ఆమె తల్లి ఎదురుచూస్తోంది.

తెలంగాణలో మరో ఆడకూతురు తన కూతురులాగానే మరణించడంపై నిర్భయ తల్లి ఆశాదేవీ తాజాగా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మన వ్యవస్థలోని లోపాల వల్లే ఈ తరహా ఘటనలు పదేపదే ఉత్పన్నమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులు ఏ సమయంలోనైనా భయం లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు.

రాత్రి 11 గంటలైనా.. రెండు గంటలైన పురుషులు తిరిగినంతగా.. మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఉందని నిర్భయ తల్లి ఆశాదేవి వాపోయారు. నేరం చేస్తే రెండు మూడేళ్లు జైలుకు వెళ్లి వస్తే సరిపోతుందనే భావన నేరస్థులకు భయం లేకుండా చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని నేరస్థులు చెలరేగిపోతున్నారని.. ఇది మన ధౌర్భాగ్యం అంటూ ఆశాదేవి ఆవేదన చెందారు.

నిర్భయ కేసులో నేటికి న్యాయం జరగలేదని.. ఇప్పటికీ 7 సంవత్సరాలుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు – చట్టాలు – నేరస్థులకు చుట్టాలుగా మారాయని.. నేరస్థులు ఎందుకు భయపడుతారని ఆమె ప్రశ్నించారు. దేశం పురుష ప్రధానంగా ముందుకెళ్తోందని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
Please Read Disclaimer