ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్

0

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సినీ వర్గాల వారికి ప్రాముఖ్యత లభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా సినీ వర్గాల వారికి అన్ని పార్టీల వారు ప్రాముఖ్యత ఇస్తూ సీట్లను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అధికార బీజేపీ గెలుపు గుర్రం మరోసారి ఎక్కాలనే ఉద్దేశ్యంతో సినీ ప్రముఖులకు పలు సీట్లు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క బీజేపీ మాత్రమే కాకుండా దాదాపు అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులకు సీట్లు ఇస్తున్న నేపథ్యంలో వచ్చే పార్లమెంటులో సినీ ప్రముఖులు పలువురు అక్కడ కొలువు దీరే అవకాశం కనిపిస్తుంది.

బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజకవర్గం నుండి హీరోయిన్ – మోడల్ నిషా యోగేశ్వర్ కు ఛాన్స్ దక్కనుందని వార్తలు వస్తున్నాయి. మొదట ఈ స్థానంను సిపి యోగేశ్వర్ కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే ఆయన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తనకు బదులుగా తన కూతురు నిషాకు ఆ స్థానంను కేటాయించాల్సిందిగా ఆయన బీజేపీ అధిష్టానం ముందు విజ్ఞప్తి ఉంచాడు. ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిషాకు ఆ స్థానంను కేటాయించాలని అధిష్టానం సైతం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

కేవలం 29 ఏళ్ల వయసు ఉన్న నిషా ఒక వేళ పార్లమెంటు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తే లోక్ సభలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో తండ్రి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిషా మంచి స్పీచ్ లతో అదరగొట్టింది. అందుకే ఈ సారి ఆమెను పార్లమెంటు బరిలో దించేందుకు స్థానిక బీజేపీ నాయకులు ఉవ్విల్లూరుతున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే బీజేపీ నుండి నిషా యోగేశ్వర్ కు సీటు కన్ఫర్మ్. ఆమె గెలుపు గుర్రం కూడా ఎక్కడం కన్ఫర్మ్ అంటూ స్థానిక బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు.
Please Read Disclaimer