వివాహ బంధంతో ఒక్కటైన నితిన్, షాలిని

0

హీరో నితిన్, షాలిని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వైభవంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నితిన్-షాలిని వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వాదించారు.

నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలిని కందుకూరి. నితిన్, షాలినీలది ఎనిమిదేళ్ల పరిచయం. ఐదేళ్ల పాటు ప్రేమించుకన్న తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న నితిన్‌, షాలినిల పసుపు, కుంకుమ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి తేదీలను నిర్ణయించారు. దుబాయ్‌లో వీరి వివాహం జరపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే కరోనా వైరస్ వల్ల కుదరలేదు.

కరోనా రోజురోజుకి విజృంభిస్తుండటంతో హైదరాబాద్‌లోనే వివాహ వేడుక జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 22న హైదరాబాద్‌లో నితిన్, షాలినీల నిశ్చితార్థం జరిగింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో ఈ నిశ్చితార్థ వేడుకను సింపుల్‌గా నిర్వహించారు. ఇక, పెళ్లికి రెండు రోజుల ముందు మెహందీ, సంగీత్ కార్యక్రమాలను హుషారుగా జరిపారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వివాహాం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే పెళ్లి వేడుకను వైభవంగా నిర్వహించారు.