అసలేం జరుగుతోంది నితిన్?

0

గత ఏడాది ఆగస్ట్ లో శ్రీనివాస కళ్యాణం తర్వాత ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త సినిమా విషయంలో ఆన్ లైన్ లో ప్రచారమవుతున్న వార్తలు రకరకాల ఊహాగానాలకు అవకాశం ఇస్తున్నాయి. ఛలో ఫేమ్ వెంకీ కుడుములతో భీష్మ అనే ప్రాజెక్ట్ ఇంతకు ముందే కన్ఫర్మ్ చేసిన నితిన్ ఉన్నట్టుండి చంద్రశేఖర్ యేలేటి సినిమా అనౌన్స్ చేయడం కొంత కన్ఫ్యూజన్ రేపింది.

అయితే ఒకేసారి రెండు సినిమాలు ప్లాన్ చేసుకోవడం యూత్ హీరోస్ కు పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి ఫ్యాన్స్ ఆ కోణంలో ఆలోచించి సాధ్యం కావొచ్చన్న అంచనాతో ఓకే అనుకున్నారు. అయితే మధ్యలో రమేష్ వర్మ వచ్చి నితిన్ తో ఓ సినిమా చేయబోతున్నాను అనే ఫీలర్స్ ని స్వయంగా బయటికి పంపడంతో మీడియాకు సైతం కొంత అయోమయం కలిగింది

ప్రస్తుతానికి నితిన్ వీటికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ స్వయంగా బయటికి వచ్చి ప్రెస్ మీట్ రూపంలోనో లేదా ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా వీటికి పూర్తిగా చెక్ పెట్టొచ్చు. ఎవరిది ముందు ఎవరిది తర్వాత క్యాన్సిల్ అయిన సినిమా ఏదైనా ఉందా లాంటి వివరాలన్నీ చెప్పేస్తే ఇంకే సమస్యా ఉండదు.

ఫ్యాన్స్ మాత్రం నితిన్ ఇప్పటికే ఏడు నెలలు గ్యాప్ తీసుకోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన టార్గెట్ తోనే నితిన్ తొందపడటం లేదని ఒక్కసారి అన్ని ఓకే అయితే మధ్యలో గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు వచ్చేలా ప్లానింగ్ లో ఉన్నాడని సన్నిహితులు అంటున్నారు. ఏమైనా సరే నితిన్ క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రవాహానికి అంత ఈజీగా అడ్డుకట్ట పడదు