ఎనర్జిటిక్ స్టార్ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు

0

కాస్త గ్యాప్ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హీరో రామ్ సక్సెస్ దక్కించుకున్నాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ చాలా విభిన్నంగా కనిపించాడు. ఆ చిత్రంలో రామ్ పాత్రకు మాస్ ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో వెంటనే మరో ప్రయోగానికి సిద్దమవ్వకుండా కాస్త జాగ్రత్తగా తదుపరి చిత్రంను రామ్ ఎంపిక చేసుకున్నాడు. రిస్క్ లేకుండా తమిళ సూపర్ హిట్ మూవీ ‘తడమ్’ ను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు.

‘నేను శైలజ’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ రీమేక్ కు డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న ఆయన హీరోయిన్స్ ను ఖరారు చేశాడు. కథానుసారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. రామ్ కు జోడీగా నివేధా పేతురాజ్ మరియు ‘నేల టికెట్’ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మాళవిక శర్మను ఎంపిక చేశారు.

వీరిద్దరు కూడా రామ్ కు సరిజోడీగా ఈ రీమేక్ లో కనిపిస్తారని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి సినిమాను వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తమిళంలో తడమ్ సినిమాలో నటించినందుకు గాను అరుణ్ విజయ్ కి మంచి గుర్తింపు రావడంతో పాటు కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ ను అతడి ఖాతాలో వేసింది. అందుకే ఈ రీమేక్ కూడా రామ్ కు తప్పకుండా సూపర్ హిట్ ను అందిస్తుందని నమ్ముతున్నారు. ఈ రీమేక్ రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో నిర్మాణం జరుగబోతుంది.