నిర్మాతల్ని వణికేలా చేస్తున్నక్వీన్!

0

ఎదిగే కొద్ది ఒదగాలి. అదేం సిత్రమో కానీ ఉరందరిది ఒక దారి అయితే అన్న సామెత చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శను ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి కంగనా. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తున్న తీరుతో ఆమె తరచూ వార్తల్లోకి నిలుస్తుంటారు. ఎక్కడైనా ఒకరితో గొడవ ఉంటుంది.. ఇద్దరితో ఇబ్బంది ఉంటుంది. లేదంటే నలుగురికి చిరాకులు ఉంటాయి. కానీ.. కంగానాకు మాత్రం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరితోనూ ఇబ్బందే. నిప్పుకు నీళ్లు తోడైన చందంగా ఈ మధ్యన కంగనాకు ఆమె సోదరి రంగోలి జోడి కట్టటం.. మాటకు రెండు మాటలు అంటున్న వైనం ఇప్పుడు అనేక వివాదాల్ని తెర మీదకు తెస్తోంది.

తాజాగా ఆమె నటించిన ‘జడ్జ్ మెంటల్ హై క్యా’ చిత్రానికి సంబంధించి ఒక పాటను ముంబయిలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్టుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడటం తెలిసిందే. కంగనాను ప్రశ్నించే క్రమంలో ఆమె అందుకు అంగీకరించకపోవటమే కాదు.. ఆవేశానికి గురై.. సదరు జర్నలిస్టు కంగనా మూవీ మణికర్ణిక చిత్రానికి తక్కువ రేటింగ్ ఇచ్చారని.. సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాసినట్లుగా పేర్కొంటూ నానా మాటలు అన్నారు.

దీనిపై సినిమా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గని ఆమె తీరుపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు ఆమె స్పందించిన తీరు బాగోలేదన్నకామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కంగనా తీరుపై ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. జరిగిన దానికి కంగనా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె క్షమాపణలు చెప్పని పక్షంలో ఆమెకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. కంగనాతో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాలాజీ మోషన్ పిక్చర్స్ ఒక ప్రకటనను విడుదల చేసింది. జరిగిన సంఘటనపై తాము క్షమాపణలు చెబుతున్నామని.. సాంగ్ లాంఛ్ ప్రోగ్రాం సందర్భంగా తలెత్తిన వివాదంపై వారు విచారం వ్యక్తం చేశారు.

ఇతరుల మనోభావాల్ని దెబ్బ తీయటం తమ ఉద్దేశం కాదని పేర్కంది. తమ చిత్రం ఈ నెల 26న విడుదల అవుతుందని.. జరిగిన విషయాన్ని మర్చిపోయి మీడియా ఎప్పటిలానే తమకు సహకరించాలని కోరింది. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమంటే.. ఈ మొత్తం వివాదానికి కారణమైన కంగనా మాత్రం తాను సారీ చెప్పేదే లేదంటూ తేల్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సారీ చెప్పమని కంగనా సోదరి రంగోలీ ట్వీట్ చేసి మరింత మంట పుట్టేలా చేశారు.

కంగన సారీ చెప్పదు.. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు.. మీలాంటి దేశద్రోహుల్ని.. తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుందని ట్వీట్ చేశారు. దీంతో.. సర్దుకుపోదామనుకున్న జర్నలిస్టులు ఇప్పుడు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస పరిణామాలతో ‘జడ్జ్మెంటల్ హై క్యా’ చిత్ర నిర్మాతలు వణికిపోతున్నారు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా.. తమ సినిమా విడుదల వేళలోనే ఇదంతా జరగాలా? అని వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. కంగన తీరు మార్చుకోకుంటే బ్యాన్ విధించేందుకు గిల్డ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఒక నటిపై బ్యాన్ విధించటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అవుతుంది.
Please Read Disclaimer