హిట్టు కాబట్టి మెగా ఫ్యాన్స్ విభేదాలు బయటపడలేదా?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ ఈ సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా ఎంత హిట్టు అనేది పక్కన పెడితే ‘అల వైకుంఠపురములో’ టీమ్ మాత్రం ఈ సినిమాను నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టుగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే సాధారణ ప్రేక్షకులు ఈ మాటలను పెద్దగా నమ్మడం లేదు. మెగా ఫ్యాన్స్ లో కూడా చాలామందికి ఈ ఇండస్ట్రీ హిట్ క్లెయిం పై అపనమ్మకాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మెగా టాగ్ కు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తూ ఉండడం మెగా ఫ్యాన్స్ లో ఒక సెక్షన్ కు నచ్చడం లేదు. సరిగ్గా ‘సైరా’ రిలీజుకు ముందు ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్ మొదలు పెట్టడం.. ‘సైరా’ సినిమాపై అల్లు అర్జున్ లేటుగా స్పందించడం వంటి కారణాలు మెగా ఫ్యాన్స్ కు అసహనం కలిగించాయి. మెగా హీరోలు ఎవరైనా ఇండస్ట్రీ హిట్లు సాధిస్తే వారు స్వయంగా గొప్పలు చెప్పుకోరు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. ఈ జెనరేషన్ హీరో చరణ్ కూడా ఎప్పుడూ రికార్డుల ప్రస్తావన తీసుకురారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ‘అల వైకుంఠపురములో’ హిట్టు గురించి అదేపనిగా చెప్తూ ఉండడం మెగా ఫ్యాన్స్ లో చాలామందికి నచ్చడం లేదట.

గతంలో కూడా అల్లు అర్జున్ పలు సందర్భాలలో తన వ్యాఖ్యలతో ప్రవర్తనతో వివాదాలు కొని తెచ్చుకున్నారు. ఈ సినిమా విషయంలో ఫేక్ కలెక్షన్లను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. అదొక్కటే కాకుండా ఇండస్ట్రీ హిట్ అంటూ ఊదరగొట్టడం లాంటి వాటితో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. అయితే ఈ సినిమా హిట్టు కాబట్టి ఆ విభేదాలు బయటపడడం లేదని.. భవిష్యత్తులో ఆ అసహనం బయట పడేఅవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. మరి అల్లు అర్జున్ దీన్ని సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.