చాలా ఇబ్బందిగా అనిపించింది.. ఐటీ రైడ్స్ వార్తలపై నాగార్జున

0

టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో పేరున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన కార్యాలయం, రామానాయుడు స్టూడియోస్, నిర్మాత సురేష్ బాబు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా సురేష్ బాబు సోదరుడు, విక్టరీ వెంకటేష్ ఆదాయ లెక్కలను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఉన్నట్టుండి దగ్గుబాటి ఫ్యామిలీపై ఐటీ రైడ్స్ జరగడంతో టాలీవుడ్ అంతా టాం టాం అయ్యింది.

నేచురల్ స్టార్ ఇంటిపై..

దగ్గుబాటి ఫ్యామిలీపై మాత్రమే కాకుండా నేచురల్ స్టార్ నాని ఇల్లు, కార్యాలయంపై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. అలాగే, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్ను ఎగవేతలకు సంబంధించి లెక్కలు చూసుకునేందుకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఈనెల 20న ఉదయం మొదలైన సోదాలు సాయంత్రం వరకు జరిగాయి.

నాగార్జున ఆస్తులపై కూడా..

ఆదాయ పన్ను సోదాలు జరుగుతన్న క్రమంలో కింగ్ నాగార్జున ఇల్లు, కార్యాలయాలపై కూడా సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇదొక రూమర్ మాత్రమే. జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ కొంత మంది నాగార్జునకు ఫోన్ చేసి మీ ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగాయట కదా అని అడిగారట. దీంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని ఆయన శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఎలాంటి సోదాలు జరగలేదు

‘‘ఆదాయ పన్ను శాఖ అధికారులు మీ ఆస్తులపై సోదాలు జరిపారా అంటూ నా స్నేహితుల్లో కొంత మంది ఫోన్లు చేసి అడిగారు. నాపై వచ్చిన ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి (ఎంబారజింగ్ ఎమోజీ పెట్టి). ఇలాంటి సోదాలు ఏవీ నాపై కానీ, నా కార్యాలయాలపై కానీ జరగలేదు’ అని నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘బ్రహ్మాస్త్ర’లో ఆర్కియాలజిస్టుగా..

నాగార్జున ప్రస్తుతం హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీ రాయ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తరవాత సాల్మన్ అనే కొత్త దర్శకుడితో కింగ్ సినిమా చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలో నాగ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారట.
Please Read Disclaimer