అల్లు అరవింద్ ను ప్రమోట్ చేసే వారే లేరా?

0

ఏ కొడుక్కి మాత్రం తండ్రంటే ఇష్టం ఉండదు? నాన్న మీద అభిమానం ఉండటం ఒక ఎత్తు. దాన్ని ఓపెన్ గా చెప్పేయటం మరో ఎత్తు. ఈ మాటకు తాజాగా మరో వ్యాక్యాన్ని యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే.. తన తండ్రి మీద ఉన్న ఇష్టాన్ని చెప్పేయటమే కాదు.. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డును ప్రకటించాలని ఓపెన్ గా అడిగేశాడు అల్లు అర్జున్.

తన మనసులోని భావాల్ని అదిమి పెట్టకుండా.. అనిపించింది అనిపించినట్లుగా చెప్పేసే అల్లు అర్జున్.. తాజాగా తన మూవీ ప్రోగ్రాంలో ఓపెన్ గా చెప్పేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. అల్లు అర్జున్ మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఎవరైనా తమ కుటుంబంలోని వారికి అవార్డులు ఇవ్వాలని కోరటం ఉండదు. ఎందుకంటే.. అవార్డులు.. పురస్కారాలు అన్నవి అడిగి ఇప్పించుకోవటం కాదు.. గుర్తించి ఇవ్వాలనుకునేవి.

అయితే.. ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకుంటే.. అవార్డులు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. అడగందే అమ్మ అయిన పెట్టదన్నట్లు.. మనం ప్రయత్నించకుండా పురస్కారాలు రావన్న ప్రచారం ఉంది. ఒకవేళ..తాము మనసు పడిన పురస్కారాల గురించి గుట్టుగా ప్రయత్నాలు చేసేసి.. సొంతం చేసుకునే ఉదంతాలు బోలెడన్ని కనిపిస్తాయి. కానీ.. ఇందుకు భిన్నంగా అల్లు అర్జున్ మాదిరి ఓపెన్ గా.. మా నాన్న చేసిన సేవలకు పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట మాత్రం ఇటీవల కాలంలో ఎవరూ చెప్పలేదని చెప్పాలి.

అయినా.. అల్లు అరవింద్ కు అవార్డు ఇవ్వాలన్న మాట ఆయన కొడుకు అల్లు అర్జున్ ఎందుకు అడగాలి? మరెవరు ఎందుకు అడగలేదు? అసలెవరూ ఎందుకు ప్రస్తావించలేదు? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. అనుకోకుండా జరిగిందో..అనుకునే జరిగిందో కానీ.. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరూ మూవీ ప్రోగ్రాంకు స్పెషల్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక అగ్ర కథానాయకుడికి ఒక టాప్ హీరో అవార్డు ఇవ్వాలని కోరటంలో అర్థముంది. అందుకు భిన్నంగా తన తండ్రికి పద్మ పురస్కారం ఇవ్వాలని అల్లు అర్జునే స్వయంగా కోరటం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. అల్లు అరవింద్ ను ప్రమోట్ చేసేవారెవరూ ఇండస్ట్రీలో లేరా? ఆయన చేసిన సేవల్ని ఇండస్ట్రీలో మరెవరూ ప్రస్తావించరా? ఎందుకిలా? అన్నవి మాత్రం ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలాయని చెప్పక తప్పదు.