‘సాహో’ టీంకి పర్మిషన్ రాలేదా.. భయపడిందా?

0

‘బాహుబలి: ది కంక్లూజన్’తో పాటు ‘అర్జున్ రెడ్డి’ – ‘ఫలక్నుమా దాస్’ సినిమాలకు వేసినట్లే విడుదలకు ముందు రోజు తెలంగాణలో సెకండ్ షో ప్రిమియర్లు వేయాలని ‘సాహో’ టీం భావిస్తున్నట్లుగా కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎలాగూ అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేయడం మామూలే. అది ప్రతి పెద్ద సినిమా విషయంలోనూ జరిగేదే. వాటికి అనుమతుల విషయంలో పెద్ద సమస్యేమీ లేదు. తెలంగాణలో అలా బెనిఫిట్ షోలు వేయడానికి పర్మిషన్లు ఇవ్వట్లేదు. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ కు మాత్రం అనుమతి ఇస్తున్నారు.

అలాగే రిలీజ్ వీక్ లో అదనపు షోలు వేసుకునేందుకు కూడా కొన్నిసార్లు అనుమతులు వచ్చాయి. ఈ మధ్యే ‘మహర్షి’ సినిమాకు ఇలా అనుమతి లభించింది. ‘సాహో’కు కూడా ఇలాగే జరుగుతుందని.. అదనపు షోలపై పట్టుబట్టకపోయినా.. ముందు రోజు మాత్రం తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో పెయిడ్ ప్రివ్యూలు మాత్రం పక్కా అని వార్తలు వచ్చాయి. కానీ విడుదల దగ్గర పడుతుండగా ఈ విషయమై చప్పుడు లేదు. ఏ అప్ డేట్ లేదు. అందరూ సైలెంటైపోయారు. చిత్ర వర్గాలు దీనిపై అస్సలు మాట్లాడట్లేదు. అభిమానులు ఆరాలు తీస్తున్నా పీఆర్వోల నుంచి స్పందన లేదు. దీన్ని బట్టి చూస్తుంటే పెయిడ్ ప్రివ్యూలు కానీ – అదనపు షోలు కానీ లేవనే అనిపిస్తోంది. మరి వీటికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదా.. లేక సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అని చిత్ర బృందం భయపడిందా అన్నది అర్థం కావడం లేదు. ‘మహర్షి’కి అనుమతులు ఇచ్చాక తమకు సమాచారం లేకుండా కోర్టు అనుమతితో టికెట్ల రేట్లు పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషల్ షోలకు అనుమతే ఇవ్వొద్దన్న నిర్ణయానికి వచ్చారన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘సాహో’ టీంకు కూడా ముందు రోజు ప్రివ్యూలు వేసే ధైర్యం లేదన్న ముచ్చటా వినిపిస్తోంది. ఇందులో ఏది నిజమో మరి?
Please Read Disclaimer