RRR: సీన్లు చెప్పేసి జక్కన్న కు షాకిచ్చిన నటుడు

0

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు చేస్తున్న మూవీ RRR. ఈ సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కథేంటి? కథానాయకుల క్యారెక్టర్లు ఏంటి? ఇద్దరు ప్రముఖ హీరోలు చేస్తున్న ఈ సినిమాలో కాంబినేషన్ సీన్లు ఎన్నుంటాయి? వారి మధ్య రిలేషన్ ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే క్వశ్చన్లకు అంతే లేదు. కానీ.. అన్నింటికి సమాధానం.. జక్కన్న పల్చటి చిరునవ్వు. దగ్గర దగ్గర రూ.300 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్.. చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో మల్టీస్టార్స్ సినిమాలు తెలుగులో వచ్చినా.. ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాగా దీన్ని చెప్పాలి. సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.. రాజమౌళి మాత్రం ఏమీ చెప్పటం లేదు. ఈ భారీ సినిమా గురించి విషయాలేమీ బయటకురాని వేళ.. ఈ సినిమా లో నటించిన ముక్కుముఖం తెలియని నటుడు ఒకరు చేసిన పని జక్కన్న కు భారీ షాకిచ్చేలా చేసింది.

సినిమాలో సైడ్ క్యారెక్టర్లలో ఒక పక్కన నిలుచొని ఉండే డైలాగుల్లేని నటుడు ఒకరు.. RRRకు సంబంధించిన కీలక అంశాల్ని బయటపెట్టేయటంపై జక్కన్న యమా సీరియస్ గా ఉన్నాడట. కీలకమైన సీన్ల గురించి రివీల్ చేసిన ఇతగాడి తీరు ఇప్పుడు RRR టీంలో కలకలం రేపుతోంది. ముందు నుంచి ప్రచారం సాగుతున్నట్లుగా రాంచరణ్.. ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీన్ ఉంటుందని చెప్పేయటమే కాదు.. అందులో తారక్ ను చెర్రీ కొడతాడంటూ అతగాడు భారీ సీక్రెట్ ను రివీల్ చేసేశాడు. అంతేకాదు.. వారిద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ను ఏకంగా పది రోజుల పాటు షూట్ చేసిన వైనాన్ని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. ఒక సీన్లో చరణ్ బ్రిటిషర్ డ్రెస్ లో ఉంటే.. తారక్ కుర్తా ఫైజమాలో ఉంటాడని అతగాడు చెబుతున్న వైనం తో జక్కన్న పరివారానికి ఎలా స్పందించాలో అస్సలు అర్థం కావటం లేదట. తన సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని పరమ గుట్టుగా ఉంచే జక్కన్నతీరుకు భిన్నంగా రివీల్ చేయకూడని అంశాల్ని బయటకు చెప్పేసిన సదరు చిన్న నటుడి తీరు పై యమా గుస్సాగా ఉన్నాడట రాజమౌళి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకులు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది




Please Read Disclaimer