సూపర్ స్టార్ వెనుక పడుతున్న ఓల్డ్ స్టార్ డైరెక్టర్…?

0

టాలీవుడ్ లో కామెడీకి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీను వైట్ల. ‘ఆనందం’ ‘సొంతం’ ‘వెంకీ’ ‘ఢీ’ ‘కింగ్’ ‘దుబాయ్ శీను’ ‘రెడీ’ ‘నమో వెంకటేశాయ’ ‘దూకుడు’ ‘బాద్ షా’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు. చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – రవితేజ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల సినిమా వచ్చిందంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేవారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు శ్రీను వైట్ల అంటే అవుట్ డేటెడ్ డైరెక్టర్ అని.. ఫేడవుట్ దశలో ఉన్న డైరెక్టర్ అని కామెంట్ చేస్తుంటారు. దీనికి కారణం ‘ఆగడు’ సినిమా నుండి శ్రీను వైట్ల తన హిట్ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో తీసిన ‘బ్రూస్ లీ’.. వరుణ్ తేజ్ ‘మిస్టర్’.. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో టాలీవుడ్ హీరోలు నిర్మాతలు ఈయనతో సినిమా అంటేనే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటారు అని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటుంటారు. ఇలాంటి సమయంలో శ్రీను వైట్ల తన సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారట.

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీను వైట్ల రూపొందించిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పటికి మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘దూకుడు’ సినిమాకి సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కి ‘దూకుడు 2’ స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారట. 2014లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆగడు’ పరాజయం చవి చూసింది. నిజానికి ‘ఆగడు’ సినిమా ‘దూకుడు’కి సీక్వెల్ గా ఉండటం వల్లనే ప్లాప్ అయిందని.. అసలు టైటిల్ ‘దూకుడు 2’ అని పెడితే ఓ మోస్తరుగా అయినా ఆడేదని అందరూ కామెంట్స్ చేసారు. మరి ఇప్పుడు ‘దూకుడు 2’ అంటూ శ్రీను వైట్ల ప్రయత్నానికి మహేష్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి. దీంతో పాటు శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మంచు విష్ణుతో ఈ విషయంపై డిస్కషన్స్ కూడా జరిగినట్లు సమాచారం. మొత్తం మీద తన హిట్ సినిమాల సీక్వెల్స్ తో మళ్ళీ రేస్ లో నిలబడాలని ఈ ఓల్డ్ స్టార్ డైరెక్టర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.