మెజారిటీ లేకుండా ఆర్డర్స్ వేస్తాడా?

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుకలుకలు తొలి నుంచి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు నరేష్ తో ‘మా’ కార్యవర్గానికి పొసగక పోవడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రమాణ స్వీకారం రోజే గొడవలు మొదలవ్వడంతో విభేధాలు బయటపడ్డాయి. నరేష్ బృందం.. జీవిత రాజశేఖర్ బృందం అంటూ రెండు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఈసీ కార్యవర్గం మీటింగులు పెట్టడం వగైరా ఇటీవల బయటపడింది. ఈ ఎపిసోడ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అగ్రెస్సివ్ స్టంట్ నే తలపించింది.

అధ్యక్షుడినైన నాకే తెలియకుండా కార్యదర్శులు మీటింగులు పెడతారా? అంటూ నరేష్ గుర్రుమన్నారు. అసలు నరేష్ ఒంటెద్దు పోకడ ఏమీ బాగా లేవని ప్రత్యర్థి వర్గం విమర్శిస్తోంది. నా అనే తత్వం నుంచి ఆయన బయటపడలేదన్నది తొలి నుంచి నరేష్ పై విమర్శలున్నాయి. దీనేనే ప్రధాన కార్యదర్శి జీవిత- ఉపాధ్యక్షురాలు హేమ వంటి వాళ్లు ఎత్తి చూపుతున్నారు. మెజారిటీ సభ్యులకు నచ్చేలా అధ్యక్షుడు నరేష్ వ్యవహరించడం లేదని దుయ్యబడుతున్నారు. సందేహం తీర్చాలని అడిగితే సమాధానం దాటవేస్తూ .. రిప్లయ్ సరిగా ఇవ్వడు అని ..తనకు తలబిరుసు స్వభావం అని ఎదురుదాడికి దిగారు. కొత్త అధ్యక్షుడు వచ్చాక నిధి సేకరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు.

జీవిత మాట్లాడుతూ.. 950 మంది మా సభ్యుల్లో 26 మంది కమిటీకి ఎన్నికయ్యారు. ఒక అధ్యక్షుడు .. ఇద్దరు ఉపాధ్యక్షులు.. ఇద్దరు సంయుక్త కార్యదర్శులు.. ఒక ప్రధాన కార్యదర్శి.. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్.. 18 మంది ఈసీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరూ మెజారిటీతో గెలిచారు. అందువల్ల ప్రతి ఒక్కరికి బాధ్యతలతో పాటు సమానమైన పవర్స్ ఉన్నాయని అన్నారు. కమిటీలో 18 మంది మా వైపు ఉంటే.. 8 మంది మాత్రమే నరేష్ కి మద్ధతుగా నిలిచారని.. నరేష్ కి అసలు మెజారిటీనే లేదని జీవిత వెల్లడించారు. మెజారిటీ లేకుండా ఆర్డర్స్ వేస్తాడా? అంటూ ప్రశ్నించారు. మా అధ్యక్షుడు నరేష్ ని వ్యతిరేకిస్తూ జీవిత రాజశేఖర్ బృందం ఈసీ మీటింగ్ జరపడంతో అసలు గందరగోళం మొదలైంది. దీనిపై నరేష్ కోర్టుకు వెళతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే సామరస్యంగా పరిష్కరించాల్సిన సమస్యను ఇలా రోడ్డుకెక్కించడం బాలేదని విమర్శలొస్తున్నాయి.
Please Read Disclaimer