ఓటీటీలు ‘ఓవర్ ది టాప్’ అనిపించుకోలేకపోతున్నాయా…?

0

ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.. అంటే ‘ఓవర్ ది టాప్’ అని అర్థం. మారుతున్న టెక్నాలజీతో పాటు సినిమా రిలీజ్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాలు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఇక తిరిగి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రాబోయే రెండు నెలల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనేదీ అనుమానమే. దీంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు డజను సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో రాను రాను ఓటీటీలపై ఆసక్తి పోతుందేమో అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే థియేటర్స్ లో రిలీజైనా ప్లాప్ అవుతాయనే సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయనే పేరు వచ్చేసింది. ఇటీవల భారీ అంచనాలతో రిలీజైన కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ సినిమాతో ఇది నిజమేమో అనే భావన కలిగించింది. ఈ సినిమా కోసం సదరు ఓటీటీ భారీగా ప్రమోషన్స్ చేయడంతో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. తీరా సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులు అందరూ పెదవి విరిచారు. ఓటీటీలో వచ్చే సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేని సినిమాలు అని బలంగా నమ్మేలా చేసింది. ఇలాంటి సినిమాలతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఎంతకాలం మనుగడ సాధించగలవనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఈ మూవీస్ తో ప్రొడ్యూసర్స్ లాభపడుతున్నప్పటికీ ఓటీటీలకు ఏమాత్రం క్రేజ్ తీసుకురాలేకపోతున్నాయనే చెప్పవచ్చు.

అంతేకాకుండా ఓటీటీలు పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాలు రిలీజ్ చేయడం లేదు. మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి అన్ని సినిమాలతో పాటు కొత్త సినిమాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఈ సినిమాల వల్ల ఓటీటీలకు పెద్దగా వచ్చింది కూడా ఏమీ లేదు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా సినిమా ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ చేసి మిగతా ప్రమోషన్స్ భారాన్ని ఓటీటీల మీద వేస్తున్నారట. దీంతో ప్రమోషన్స్ కి కూడా ఓటీటీలకు అధిక మొత్తంలో ఖర్చు అవుతోంది. ఇన్ని చేసినా సినిమాలు మాత్రం ఓటీటీలకు ఏ మాత్రం ప్లస్ కావడం లేదనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఇదిలాగే కొనసాగి మరో రెండు మూడు సినిమాలు నిరాశపరిస్తే మాత్రం ఓటీటీ అంటే ‘ఓవర్ ది టాప్’ అనిపించుకోలేకపోతోంది అనే కామెంట్స్ వస్తాయి అని అభిప్రాయపడుతున్నారు.
Please Read Disclaimer