అర్జున్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసిన పార్వతి

0

అర్జన్ రెడ్డి/కబీర్ సింగ్ సినిమాలు ఎంత పెద్ద హిట్లు అయినప్పటికీ ఈ సినిమాలపై విమర్శకులు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరో విపరీత ప్రవర్తన.. హీరోయిన్ కు వ్యక్తిత్వం లేదు అన్నట్టుగా హీరోతో ‘బలవంతం’గా ప్రేమలో పడడంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ క్రిటిక్స్ జాబితాలో మలయాళ హీరోయిన్ పార్వతి తిరువొతు కూడా చేరింది.

ఈమధ్య బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా కొందరు నటీనటులతో ఒక ప్యానెల్ డిస్కషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్.. దీపిక పదుకొనె.. మనోజ్ బాజ్ పాయి.. విజయ్ దేవరకొండ.. అలియా భట్.. ఆయుష్మాన్ ఖురానా .. విజయ్ సేతుపతి.. పార్వతి తిరువొతు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని సినిమాలపై చర్చించారు. ‘అర్జున్ రెడ్డి’ ప్రస్తావన వచ్చినప్పుడు పార్వతి విమర్శలు చేసేందుకు వెనుకాడలేదు. విజయ్ పక్కనే కూర్చుని ఉన్నప్పటికీ ‘హీరో పాత్ర దుడుకు స్వభావంతో హీరోయిన్ పాత్రపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడం..ఆ అమ్మాయి బలహీనంగా అన్నిటికి ఒప్పుకోవడం” సరి కాదని వాదించింది. అది స్త్రీలను.. స్త్రీల వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమేనని తన అభిప్రాయం కుండబద్దలు కొట్టింది. సినిమాలో కమర్షియల్ అంశాలు ఉండాలంటే ఎవరినీ తక్కువ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.

అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్లను గొప్పగా చూపించాల్సిన ఆవసరం లేదని పార్వతి అభిప్రాయపడింది. పార్వతి తన అభిప్రాయాలను విజయ్ పక్కన ఉన్నప్పుడే ఏమాత్రం మొహమాటం లేకుండా వెల్లడించడంపై నెటిజన్లు పార్వతిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Please Read Disclaimer