పింక్ రీమేక్ పై పవన్ అనాసక్తి?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సస్పెన్స్ డ్రామాని తలపిస్తోంది. ఆయన ఏ సినిమాతో రీఎంట్రీ ఇస్తారు? అన్నది ఇప్పటికి ఇంకా సస్పెన్స్. పవన్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తాడని నిర్మాతలు దిల్ రాజు-బోనీకపూర్ బృందం చెబుతోంది. కానీ పవన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎక్కడా ప్రకటించలేదు. తన ట్విటర్ వేదికగా రాజకీయాంశాలపై స్పందిస్తున్నారు తప్ప సినిమా గురించి ప్రస్తావించడం లేదు. అయితే పవన్ .. పింక్ రీమేక్ లో నటిస్తున్నారా? అంటూ అభిమానులు.. నెటి జనుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా వాటికి పవన్ ఏమాత్రం స్పందించడంలేదు. ఈ వ్యవహారం చూస్తుంటే పవన్ పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇవ్వడం సందేహమేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

తాజాగా ఈ కథనాల్ని బలపరుస్తూ పవన్ సన్నిహిత వర్గాల నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పింక్ రీమేక్ లో పవన్ నటించడానికి ఏమాత్రం ఆసక్తిగా లేరని…ఆయన మైండ్ లో మరో స్టోరీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పింక్ లో చక్కని సందేశం ఉన్నా.. పవన్ పొలిటికల్ ఇమేజ్ పెంచే కథాంశం కాదు అది. రీఎంట్రీకి ఎంచుకునే స్క్రిప్టులో ఆ జాగ్రత్త తప్పనిసరి అని భావిస్తున్నారట. ఏపీలో గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా పవన్ అదేమీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవలే భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక కొరత సమస్యపై జనసైనికులతో కలిసి విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించాడు. ప్రజా సమస్యలపై పోరాటానికి పవన్ ఆసక్తిగా ఉన్నారు.

అందుకే అతడి పొలిటికల్ మైలేజ్ కి సహకరించే విధంగా స్క్రిప్టు ఉండాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రశ్నించే నాయకుడు.. పోరాట స్ఫూర్తిని రగిల్చే నాయకుడిగానో తెరపై కనిపిస్తే బావుంటుందని పవన్ భావిస్తున్నారట. నేటి ట్రెండుకు తగ్గట్టే ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంలో నటిస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారట. ప్రభుత్వంపై పోరాటం చేసే ఓ విప్లవ నాయకుడు చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు సాగించిన పోరాటాన్ని హైలైట్ చేస్తూ కథాంశం ఉండాలని భావిస్తున్నారట. ఇలాంటి ఆసక్తి రేకెత్తించే కథతో సినిమా చేస్తేనే తనకు రాజకీయంగాను ఎదిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని.. ఇదే విషయాన్ని పరిశ్రమలో తన సన్నిహితుల వద్ద చర్చించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? పింక్ రీమేక్ లో పవర్ స్టార్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలపై ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Please Read Disclaimer