23 ఏళ్ల జర్నీ.. పవన్ రీఎంట్రీ ఎపుడు?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీకెరీర్ చూస్తుండగానే రెండు దశాబ్ధాలు పూర్తయింది. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రం 11 అక్టోబర్ 1996న రిలీజైంది. అటుపై దాదాపు 23ఏళ్ల పాటు కెరీర్ జర్నీ సాగించి టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అసాధారణ ఫాలోయింగ్ సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థానం అందుకున్నది పవన్ కల్యాణ్ మాత్రమే అనడంలో సందేహం లేదు. అన్న పిస్తోలు తీసుకుని ఆత్మ హత్య చేసుకోవాలన్నంత డిప్రెషన్ ని జయించి ఎంతో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన స్టార్ గా ఆయన గురించి అభిమానుల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది. అసలు సినిమాల్లోకి యాథృచ్ఛికంగా ప్రవేశించినా.. చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మి తాను ఆ స్థాయిని అందుకున్నానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు.

ఇదొక్కటే కాదు.. లైఫ్ లో ఎదురయ్యే ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ని జయించానని పవన్ చెబుతుంటారు. అదంతా ఒకెత్తు అనుకుంటే.. ఇటీవల రాజకీయాల్లో ప్రవేశించి జనసేన పార్టీని స్థాపించారు. అయితే వెండితెరపై టాప్ స్టార్ గా వెలిగిన పవన్ కల్యాణ్ కి రాజకీయాల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు! అన్నది పక్కాగా ఆయన విషయంలోనూ ప్రూవైంది. అయినా ఇప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా జనసేన అధినాయకుడిగా ఏపీ రాజకీయాల్లో విపక్ష పాత్రను పోషిస్తున్నారు.

ఇక ఇదంతా ఒకెత్తు అనుకుంటే 23 ఏళ్ల కెరీర్ లో పవన్ కల్యాణ్ నటించింది కేవలం 25 సినిమాలు మాత్రమే. అంటే.. ఏ ఇతర స్టార్ హీరోహీరో మైలేజ్ తో పోల్చినా చాలా తక్కువ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నా.. తొందర్లోనే పవన్ తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ నటిస్తే సినిమాని నిర్మించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి సైతం అన్నారు. పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే…చూడాలన్న ఆకాంక్ష మెగాభిమానుల్లోనూ వెల్లడైంది. పవన్ కోసం పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరి పవర్ స్టార్ తిరిగి సినీఎంట్రీ ఇస్తారా? అన్నది చూడాలి.Please Read Disclaimer