పింక్ లో పవన్ తెల్ల గడ్డంతో కనిపిస్తారా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం గురించి చాలారోజులుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. ‘పింక్’ రీమేక్ లో పవన్ నటిస్తున్నారని ఇప్పటికే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోవైపు బోనీ కపూర్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తాడని.. దిల్ రాజు-బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తారనే విషయంపై సినీవర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ‘పింక్’ సినిమా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఒక లాయర్ పాత్ర. ఆయన వయసుకు తగ్గట్టే తెలుపు గడ్డంతో కనిపించారు. ‘పింక్’ తమిళ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ లో అజిత్ కుమార్ కూడా తెలుపు రంగు జుట్టు.. గడ్డంలో సహజంగా కనిపించారు. ఇప్పుడు పవన్ నటించబోయేది ఈ పాత్రలోనే. దీంతో పవన్ కూడా ఇలానే డై వేసుకోకుండా సహజంగా తెలుపు రంగు గడ్డంతోనే కనిపిస్తారని అంటున్నారు. పవన్ స్క్రీన్ పై ఎంత స్టైలిష్ గా ఉన్నప్పటికీ బయట మాత్రం సహజంగా ఉంటారు. ఒక్కోసారి హెయిర్ డై వేసుకోకుండానే ఉంటారు. సినిమా స్టార్లలో ఇలా సహజంగా కనిపించే ధైర్యం అతి తక్కువ మందికే ఉంటుంది. దీంతో ‘పింక్’ రీమేక్ లో సహజంగా కనిపించేందుకు పవన్ కు అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు కానీ అభిమానులు మాత్రం పవన్ సినిమాకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. పవన్ చివరి సినిమా 2018 జనవరిలో రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’. రీ ఎంట్రీ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించినా విడుదల కావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే పవన్ వెండితెరకు రెండున్నరేళ్ళు దూరంగా ఉన్నట్టు లెక్క. మరి పవన్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer