పవన్ వర్సెస్ త్రివిక్రమ్.. ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న ట్విస్టు!

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల మధ్య స్నేహానుబంధం ఎలాంటిదో చెప్పాల్సిన పనే లేదు. ఆ ఇద్దరి మధ్యా వృత్తిగత అనుబంధం కంటే స్నేహం ఎంతో గొప్పది అన్నది అందరికీ తెలిసినదే. వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలు జల్సా- అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. ఆ తరువాత చేసిన `అజ్ఞాతవాసి` భారీ డిజాస్టర్ గా నిలిచినా త్రివిక్రమునిపై పవన్ గురి ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ మూడు చిత్రాల తరువాత మరో సినిమాని పవన్ చేయాలనుకున్నారట. కానీ ఇక్కడే ఊహించని ట్విస్టు.. పవన్ ప్రపోజల్ ని త్రివిక్రమ్ తిరస్కరించినట్టు తెలిసింది.

ఇంతకీ ఎందుకని తిరస్కరించాడు మాయావి? అన్నది ఆరా తీస్తే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రఖ్యాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇటీవల మలయాళ హిట్ మూవీ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న సంగతి తెలిసినదే. ఇందులో బీజు మీనన్ పోషించిన పాత్రలో పవన్ నటిస్తే బాగుంటుందనేది ప్రపోజల్. రీమేక్ రైటర్ గా త్రివిక్రమ్ ఆ పాత్రలో పవన్ నటించాలని అడిగారట. అదే విషయాన్ని ఆయనతో చెప్పి సినిమా చూపించారు. పవన్ కు నచ్చింది .. తాను ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఓ ప్రపోజల్ని చెప్పారట.ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ స్వయంగా డైరెక్ట్ చేయాలి… వేరొకరు చేస్తే తాను నటించను అని అన్నారట. కానీ రీమేక్ ని డైరెక్ట్ చేయడం త్రివిక్రమ్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అదే విషయాన్ని చెప్పి పవన్ ప్రపోజల్ ని తిరస్కరించినట్టు తెలిసింది.

ఈ రీమేక్ కోసం ప్రస్తుతం సాగర్ చంద్రని లైన్ లోకి తీసుకొచ్చారు. రీమేక్ స్క్రిప్టుని పవన్ మెచ్చే విధంగా తీర్చి దిద్దడంతో సాగర్ చంద్ర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడట. దీంతో అతన్ని ఈ రీమేక్ కి దర్శకుడిగా ఫైనల్ చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నాడట. కేవలం ఈ ప్రాజెక్ట్ కు సమర్పకుడిగానే తాను వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.