గిల్లితేనే అర్థం అవుతుందట.. మేఘాల్లో ఉంది!

0

హిట్ సినిమాలు కరువైపోతున్న ఈ రోజులలో మొదటి సినిమాతోనే హిట్ సాధించడం ఎలాంటి హీరోయిన్ కెరీర్లో అయినా మరపురాని విషయమే. పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా ‘RX 100’ తో అలాంటి ఫీట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లే వస్తున్నాయి కానీ తన చివరి సినిమా ‘RDX లవ్’ పూర్తిగా నిరాశపరిచింది. ఫ్లాప్ కావడం ఒక తీరు అయితే బీ గ్రేడ్ సినిమా అని టాక్ రావడంతో పాయల్ ఇమేజికి కొంత డ్యామేజ్ జరిగిందనేది కూడా వాస్తవం.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు పాయల్ నటించిన క్రేజీ ఫిలిం ‘వెంకీమామ’ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాయల్ ఉత్సాహం పీక్స్ లో ఉంది. వెంకటేష్ లాంటి స్టార్ తో నటించడం పాయల్ కు మొదటిసారి కావడంతో 9 వ మేఘం మీద ఉంది. అదేంటి అని అడక్కండి. ఇంగ్లీష్ లో క్లౌడ్ నైన్ అని ఏడుస్తారు. అంటే మేఘాల్లో తేలిపోయేంత సంతోషంగా ఉందని అర్థం. మరి ఒకటి.. రెండు.. మూడు..నాలుగు మేఘాలపై అంత సంతోషం ఉండదేమో మరి. ఏం ఇంగ్లిషో ఏంటో..! సరే.. ఏ భాషలో అయినా ఇలాంటి విరుపులు చమక్కులు చాలానే ఉంటాయి. మరి ఈ బోల్డు ఆవిడ తొమ్మిదవ మేఘంపై ఉన్న విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

‘వెంకీమామ’ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ “నేను కలగంటున్నానేమో.. నన్ను గిల్లండి. వెంకటేష్ సర్ తో కలిసి నటించడం అనేది నా కల నిజమైనట్టు” అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతోనే పాయల్ ‘వెంకీమామ’ పై ఎన్ని ఆశలు పెట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కనుక హిట్ అయితే పాయల్ కు కొత్త ఆఫర్లు రావడం ఖాయమే. అయితే ఇప్పటివరకూ పాయల్ కంటే.. మరో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నాకే కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాయల్ కు మంచి పేరు వస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer