బాహుబలి టీమ్ రాయల్ రీయూనియన్

0

తెలుగు సినిమా స్థాయినే కాకుండా భారతీయ చలనచిత్రాల స్థాయిని పెంచిన ‘బాహుబలి’ కి ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు వరించాయి. అటు బాక్స్ ఆఫీస్ వసూళ్ళతో పాటుగా ఇటు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ‘బాహుబలి’ ఘనతల జాబితాలో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శన కూడా చేరనుంది.

శనివారం నాడు బాహుబలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారనే సంగతి తెలిసిందే. దీంతో ‘బాహుబలి’ టీమ్ మెంబర్స్ ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “మా అందరికీ ఇది లండన్ లో రాయల్ రీ యూనియన్. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగే బాహుబలి నేపథ్య సంగీత కార్యక్రమం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో రాజమౌళితో పాటుగా ప్రభాస్.. రానా దగ్గుబాటి.. అనుష్క.. శోభు యార్లగడ్డ ఉన్నారు. అందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని మరీ చిరునవ్వులు చిందిస్తూ ఉండడం విశేషం.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఇలా ప్రదర్శితమవుతున్న మొదటి నాన్ ఇంగ్లీష్ ఫిలిం గా ‘బాహుబలి: ది బిగినింగ్’ చరిత్ర సృష్టించనుంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ ఇలా కాన్సర్ట్ సీరీస్ ప్రదర్శించడంలో పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘హ్యారీ పోటర్ అండ్ ది గాబ్లెట్ ఆఫ్ ఫైర్’ .. ‘స్కై ఫాల్’ సినిమాలతో పాటు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలను ఇలా లైవ్ కాన్సర్ట్ కోసం ఎంపిక చేశారు.
Please Read Disclaimer