పీకే 26: దేవీ వర్సెస్ థమన్.. ఎవరు బెటర్?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఎండ్ అయినట్టేనని ప్రచారమైంది. రాజకీయాల్లోకి వెళ్లాక తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన అనడంతో 25వ సినిమా చివరిది అని ఫ్యాన్స్ కూడా భావించారు. కానీ ఆయన మనసు మార్చుకుని తిరిగి ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

పవన్ కాల్షీట్లు కేటాయించడమే ఆలస్యం.. వెంటనే పింక్ రీమేక్ ను సెట్స్ కు తీసుకెళతారు. ఈలోగా రీమేక్ కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పై దిల్ రాజు-బోనీకపూర్ బృందం దృష్టి సారించిందట. ఇక ఈచిత్రం కథలో మార్పులు చేర్పులు చేసే బాధ్యతని త్రివిక్రమ్ కి అప్పగించినట్లు ప్రచారమవుతోంది. మాయావితో పాటు దర్శకుడు వేణు శ్రీరామ్ స్క్రిప్టు పనుల్లో భాగం కానున్నాడు. మరి ఈ రీమేక్ కి సంగీత దర్శకుడు ఎవరు? ఆ అరుదైన అవకాశం ఎవరిని వరిస్తుంది? అంటే ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అందులో ఒకరు రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాగా.. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఎస్. ఎస్. గతంలో పవన్ కు దేవి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించిన సంగతి తలిసిందే. జల్సా- గబ్బర్ సింగ్ – గబ్బర్ సింగ్-2 – అత్తారింటికి దారేది ప్రతిదీ మ్యూజికల్ బ్లాక్ బస్టరే. ఇక పవన్-దేవి కాంబో అంటే అభిమానుల్లో నూ ఆసక్తి అలాగే ఉంటుంది. దేవి అంటే పవన్ కళ్యాణ్ కు అంతే నమ్మకం. అయితే గబ్బర్ సింగ్ -2 తర్వాత పవన్ రెండు సినిమాల్లో నటించినా ఆ చిత్రాలకు దేవీశ్రీకి సంగీతం అందించే అవకాశం రాలేదు.

కాటమరాయుడు- అజ్ఞాతవాసి చిత్రాలకు వేరే వేరు సంగీత దర్శకులు పనిచేసారు. అప్పటికి దేవి శ్రీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో దేవి సంగీతం విషయంలో రొటీన్ ట్యూన్స్ వినిపిస్తున్నాడనే విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంగీతం అందిస్తోన్న సరిలేరు నీకెవ్వరు విషయంలోనే మహేష్ బాబు- దర్శకుడు అనీల్ రావిపూడి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అతడికి ఛాన్సిస్తాడా? అన్నది చూడాలి.

ఇక థమన్ ఎన్నో బ్లాక్ బస్టర్లకు సంగీతం అందించినా అప్పట్లో పాత ట్యూన్స్ కాపీ కొడుతున్నాడని.. ట్రెండ్ కు తగ్గట్టు సంగీతం అందించడం లేదని విమర్శలొచ్చాయి. దివంగత దాసరి నారాయణరావు పబ్లిక్ గా కొత్తగా ట్రై చేయ్ థమన్ అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే తర్వాత థమన్ సంగీతంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. పోటీని తట్టుకుని నిలబడాలంటే క్రియేటివిటీలో కొత్తదనం ఉండాలని జాగ్రత్త పడ్డాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగుపడ్డాడు. ప్రస్తుతం దేవి శ్రీ- థమన్ స్పీడ్ మీదున్నారు. కరెక్షన్ కి వచ్చారు కాబట్టి పవన్ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలన్నది ఆలోచించుకుని తీరాలి. ఇక ఇద్దరిలో ఎవరు ఒక మెట్టు పైనున్నారు అన్నది తేలాల్సి ఉంది. టాలీవుడ్ సహా పొరుగు భాషల్లోనూ తమన్ సినిమాలు చేస్తున్నారు. దేవీ సంక్రాంతి బరిలో సినిమాతో పాటు పలు చిత్రాలకు సంతకం చేశారు. మరి పవర్ స్టార్ రీఎంట్రీ మూవీకి సంగీతం అందించే అవకాశం ఆ ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి.
Please Read Disclaimer