సూసైడ్ అటెంప్టు చేసిన టిక్ టాక్ రౌడీ బేబీ

0

కొన్నేళ్ల క్రితం చేతిలో ఉంటే సెల్ ఫోన్ తో సెలబ్రిటీ కావొచ్చని చెబితే నవ్విపోయేవారు. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అందరికి అర్థం కావటమే కాదు.. లోకల్ టాలెంట్లు.. లోకల్ సెలబ్రిటీలు భారీగా పెరిగిపోయారు. టాక్ టాక్ ఎంట్రీతో ఎంతోమంది సామాన్యులు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన సుబ్బలక్ష్మి అలియాస్ టిక్ టాక్ రౌడీ బేబీ ఈ కోవకే వస్తుంది. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలాన్ని రేపింది.

ఆమె ఎందుకు అలాంటి పని చేసిందన్న విషయంలోకి వెళితే.. తిరువూరుకు చెందిన టిక్ టాక్ రౌడీ బేబీ పలు వీడియోలు చేసి పాపులర్ అయ్యింది. తనను తాను హీరోయిన్ గా ఫీలయ్యే ఆమె ఇటీవల ఒక యువకుడి ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె సింగపూర్ వెళ్లి వచ్చింది. తాజాగా ఇంటికి వచ్చిన ఆమె.. తాను విదేశాల నుంచి వచ్చిన వివరాల్ని స్థానిక అధికారులకు తెలియజేయాలి.

కానీ.. అదేమీ చేయకుండా ఇంట్లోనే రహస్యంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆమెను టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తాను సింగపూర్ లో ఏసీ గదుల్లో ఉండేదానినని.. తనకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలని అక్కడి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది.

ఈ ఎపిసోడ్ లోనే ఒక విలేకరిని గుర్తించటం.. అతడిపై నోరుజారి ఇష్టారాజ్యంగా తిట్టేసింది. దీంతో.. ఆమె తిట్ల దండకాన్ని.. ఆధారాలతో సహా పోలీసుల చేతికి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఆమె మీద కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిణామాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించినస్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లుగా చెబుతున్నారు.
Please Read Disclaimer