వైజాగ్ టాలీవుడ్.. మెగా ఫిలింస్టూడియోతో పాటు పోసాని స్టూడియో?

0

వైజాగ్ రాజధాని ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. పాలనా రాజధాని వైజాగ్ కి తరలి వెళుతుంటే విశాఖ నుంచి విజయనగరం శ్రీకాకుళం వరకూ కారిడార్లతో అనుసంధానించి అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. అలాగే విశాఖపట్నంలోనే సరికొత్త టాలీవుడ్ ని నిర్మించాలన్నది ఆయన డ్రీమ్ అన్న ప్రచారం ఇటీవల సాగింది.

వైజాగ్ టాలీవుడ్ నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిందిగా సినీపరిశ్రమ పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని జగన్ కోరారు. ఆ మేరకు ఇంతకుముందు సీఎం జగన్ తో చిరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖలో సినీపరిశ్రమ కోసం భూములు ఇవ్వాల్సిందిగా చిరంజీవి సహా పలువురు సినీపెద్దలు కోరారన్న ప్రచారం కూడా సాగింది. పక్కా ప్రణాళికతో టాలీవుడ్ ని నిర్మిస్తే తాను సహకరిస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రచారమైంది. ఇక విశాఖలో స్టూడియో నిర్మాణానికి నందమూరి బాలకృష్ణ ఆసక్తిగా ఉన్నారని గత ప్రభుత్వ హయాంలో వార్తలొచ్చాయి. చెన్నయ్ కి చెందిన ఏవీఎం స్టూడియోస్ కూడా విశాఖలో స్టూడియో నిర్మాణానికి ఆసక్తిగా ఉందన్న చర్చా సాగుతోంది.

తాజాగా దర్శకరచయిత.. నటుడు పోసాని కృష్ణ మురళి విశాఖలో ఫిలింస్టూడియో నిర్మాణం కోసం సన్నాహకాల్లో ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే జగన్ ని కలిసి ఈ విషయంపై మాట్లాడుతారని తెలుస్తోంది. ఎన్నికల్లో వైకాపాకు అన్ని విధాలా మద్ధతునిచ్చిన పోసాని తనదైన వాక్ధాటితో ప్రత్యర్థుల ఆట కట్టించిన తీరు జగన్ కి గుర్తుంది. పైగా పదవిని ఆశించకుండా పోసాని ఆ పని చేసినందుకు ఆయనకు స్టూడియో నిర్మించుకునే అవకాశం కల్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.