డార్లింగ్ తో మిర్చి ఒన్స్ మోర్?

0

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుని చాలా ఏళ్ళయింది. రీసెంట్ గా విడుదలైన ‘సాహో’ దాదాపు ఐదేళ్ళ క్రితం ఫైనలైజ్ చేసుకున్న ప్రాజెక్టు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధాకృష్ణ కుమార్ సినిమా ‘జాన్’ కూడా దాదాపు నాలుగేళ్ళ క్రితమే ఒప్పుకున్నదే. ఆ తర్వాత ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చలయితే జరిగాయి కానీ ఒక్కటి కూడా ఫైనలైజ్ కాలేదు.

రీసెంట్ గా ప్రభాస్ లండన్ ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాత కొత్త కథలు వింటున్నారట. దీపావళి రోజు ప్రభాస్ – కొరటాల శివ మీటింగ్ జరిగిందని.. ఈ సందర్భంగా మరోసారి ఇద్దరూ కలిసి ఓ సినిమా చేసే విషయంపై చర్చ జరిగిందని సమాచారం. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ – కొరటాల సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. త్వరలోనే కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తారట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తారని సమాచారం.

రచయితగా ఉన్న కొరటాల శివకు దర్శకుడిగా ‘మిర్చి’ తో మొదటి అవకాశం ఇచ్చింది ప్రభాస్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ నిలిచి కొరటాలకు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత కొరటాల వరసగా పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు సాధించి హాట్ షాట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇప్పుడు ప్రభాస్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి.. ఇద్దరి కాంబినేషన్లో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కలగడం ఖాయం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలుస్తాయి.
Please Read Disclaimer