మహేష్ పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

0

స్టార్ పవర్ స్టామినా ఎంతో చూపించాలంటే ఇప్పుడు డిజిటల్- సోషల్ మీడియాలపై ఆధారపడాల్సిందే. అక్కడ ఎంతగా ఫాలోవర్స్ ఉంటే .. ఎంతగా డిస్ లైక్స్ లేకపోతే అంత గొప్ప ఫాలోయింగ్ ఉన్నట్టు. లక్షలాది మంది ఫాలోవర్స్ తో ఇన్ స్టా – ట్విట్టర్- ఫేస్ బుక్ లో రయ్ రయ్ మంటూ దూసుకుపోవాలి. అప్పుడే ఆ స్టార్ కి ఫ్యాన్ పవర్ ఉన్నట్టు. మహేష్.. పవన్ .. ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ ఈ విషయంలో? అంటే ఎవరికి వారే స్పెషల్ అని విశ్లేషిస్తున్నారు.

టాలీవుడ్ అగ్ర తారల అభిమానులు ప్రతిదానికి సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ లతోనే సమాధానమిస్తున్నారు. స్టార్ల పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లతో ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. ఇటీవల మహేష్ పుట్టినరోజున రికార్డు సృష్టించారు అభిమానులు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో టాప్ రేంజుకు చేర్చారు. కొన్ని వారాల్లోనే పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఫేవరెట్ పుట్టినరోజు సందర్భంగా 6.5 కోట్ల (65 మిలియన్ల) సార్లు హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టారు. ఇప్పుడు ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ వంతు. ప్రభాస్ వీరాభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు నెలకొల్పిన రికార్డుపై దృష్టి పెట్టారన్న గుసగుసా వినిపిస్తోంది.

చూస్తుండగానే డార్లింగ్ నాలుగు పదుల వయసుకు చేరుకున్నాడు. ఈ ఏడాది ప్రభాస్ తన 41 వ పుట్టినరోజును అక్టోబర్ 23 న జరుపుకోనున్నారు. ఆయన పుట్టినరోజుకు 41 రోజులు మిగిలి ఉండటంతో ప్రభాస్ అభిమానులు నిన్న సాయంత్రం 6 గంటలకు # 41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దాదాపు 50 లక్షల (5 మిలియన్) సార్లు ట్రెండ్ అయ్యింది. సరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంలో రెబెల్ స్టార్ అభిమానులు విజయవంతమవుతారో లేదో కొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఇలా సోషల్ మీడియా ట్రెండింగులతోనే స్టార్ డమ్ ని అంచనా వేయడం సరైనదేనా? అన్నది విశ్లేషించాల్సి ఉంది.