40 వచ్చేసినా పెళ్లి మాటెత్తడేం?

0

ఓవైపు కెరీర్ గోల.. ఇంకోవైపు పెళ్లి గోల! అన్ని ఒత్తిళ్ల నడుమా డార్లింగ్ ప్రభాస్ వయసు నాలుగు పదులకు చేరిపోయింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా టాలీవుడ్ లో మనకూ ఒకరున్నారు! అనేట్టే ఉంది సీను. సీనియర్ బ్యాచిలర్ ప్రభాస్ వయసు 40. అయినా ఇంకా ఆ శుభఘడియ రాలేదు మరి.

వయసొచ్చింది పెళ్లి ఊసేది? అంటే.. అబ్బే ఇంకా కాదు అనేస్తూ దాటవేశాడు ఇన్నాళ్లు. ఇక వయసు వెళుతోంది ఇప్పటికైనా మూడు ముళ్లు పెట్టేయ్ మహాప్రభో! అంటూ ఇంట్లో ఒత్తిడి పెరుగుతుందేమో. ఇప్పటికే పెదనాన్న కృష్ణంరాజు చెవినిల్లు కట్టుకుని పోరు పెట్టినా చూద్దాం చేద్దాం అంటున్నాడే కానీ కన్ఫామ్ గా ముహూర్తం పెట్టమని చెప్పడం లేదు. దీంతో అందరూ విసిగిపోయే పరిస్థితే వచ్చేట్టు ఉంది. మొన్నటికి మొన్న సాహో రిలీజ్ ముందు తెలుగు మీడియాతో ముచ్చట్లలోనూ పెళ్లిపై సరైన క్లారిటీ ఇవ్వకుండా నవ్వుతో సరిపెట్టేశాడు డార్లింగ్. అయితే ఈసారి మాత్రం క్లారిటీగానే ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికి కెరీర్ పరంగా డోఖా ఏం లేదు. పాన్ ఇండియా స్టార్ గా సెటిలైపోయాడు. ఇక పెళ్లితో సెటిలవ్వడమే పెండింగ్.

అందుకే ఇక అన్ని డైలమాల్ని క్లియర్ చేసుకుని ఈ బర్త్ డే వేళ అలాంటి శుభవార్త ఏదైనా చెబుతాడేమో అన్నదే ఫ్యాన్స్ ఆశ. 23 అక్టోబర్ తన 40వ బర్త్ డే. దటీజ్ బిగ్ డే అనే చెప్పాలి. ఆ రోజుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బర్త్ డే సెలబ్రేషన్ ఎక్కడా అంటే గుట్టు చప్పుడు కాకుండా లండన్ వెళ్లిపోతాడట. అక్కడ కూడా సీక్రెట్ లొకేషన్ లో ఈ వేడుక జరుగుతుందని ప్రచారమవుతోంది. అయితే అంతకంటే ముందే 19 అక్టోబర్ రోజున లండన్ రాయల్ ఆల్బర్ట్స్ థియేటర్ లో బాహుబలి ప్రివ్యూలో సందడి చేయబోతున్నాడు. అక్కడ ప్రముఖ హాలీవుడ్ నిపుణులతో ప్రభాస్- రాజమౌళి భేటీ జరగనుంది.
Please Read Disclaimer