సీఎం జగన్ పై సాహో కామెంట్స్

0

నోరు తెరిచి ఏం మాట్లాడినా.. ఏదో ఒకటి ఇరికించేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వీలైనంత వరకూ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఎవాయిడ్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్నా డార్లింగ్ ప్రభాస్ తీరు కాస్త భిన్నం. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం.. ఒకవేళ మాట్లాడినా ఆచితూచి అన్నట్లుగా ఉండటమే తప్పించి పెద్దగా మాట్లాడటం కనిపించదు.

సినిమా ముచ్చట్లే మాట్లాడని ప్రభాస్.. రాజకీయాల లాంటి సబ్జెక్ట్ లకు చాలా దూరంగా ఉంటారు. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖ స్టార్ల మాదిరే రాజకీయాల ప్రస్తావన తన దగ్గర్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకునే అగ్ర నటుల్లో డార్లింగ్ ఒకరు. త్వరలో విడుదల కానున్న తన సాహో చిత్ర ప్రమోషన్ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారాన్ని షురూ చేశారు. తనను ఎంత అడిగినా.. ఇంటర్వ్యూలకు నో చెప్పే ప్రభాస్.. సాహో రిలీజ్ నేపథ్యంలో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఇలాంటివేళ.. అనూహ్యమైన ప్రశ్నలు కొన్ని వస్తుంటాయి. తాజాగా ప్రభాస్ కూడా అలాంటి ప్రశ్ననే ఎదుర్కొన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నను సంధించారు. ఇలాంటి చిక్కుప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇష్టపడని ప్రభాస్.. ఈసారి చెప్పక తప్పలేదు. దీంతో.. ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. తనకు అవగాహన తక్కువని చెబుతూ.. జగన్ అధికారాన్ని చేపట్టి తక్కువ కాలమే అయ్యిందని.. అయినప్పటికీ ఆయన బాగా పని చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. డిప్లమాటిక్ పద్దతిలో సమాధాన్ని చెప్పిన ప్రభాస్.. యువనేత జగన్ నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా వివాదంలో చిక్కుకోకుండా.. అధికారపక్షంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
Please Read Disclaimer